సీఎంల 20 గంటల పని...పరుగులు తీస్తోందా ప్రగతి ?

ముఖ్యమంత్రులను ప్రధానులను ప్రభుత్వాలకు కెప్టెన్లుగా భావిస్తారు. వారి నాయకత్వంలోనే ప్రభుత్వ పాలన సాగుతుంది.

Update: 2026-08-19 03:57 GMT

ముఖ్యమంత్రులను ప్రధానులను ప్రభుత్వాలకు కెప్టెన్లుగా భావిస్తారు. వారి నాయకత్వంలోనే ప్రభుత్వ పాలన సాగుతుంది. వారి నిర్ణయాలు ఆదేశాలే పాలన మీద ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ప్రభుత్వ సారధుల మీదనే అందరి దృష్టి ఉంటుంది. మంత్రివర్గం అంతా ఒక జట్టు అయితే నడిపించే నాయకుడే ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా అని చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు చాలా మంది ముఖ్యమంత్రులు మాత్రం బాగానే పనిచేస్తున్నారు. మంచి ముఖ్యమంత్రులుగా అనిపించుకోవాలని చూస్తున్నారు. తాము పనిమంతులు అన్న ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు అనేక మంది ముఖ్యమంత్రులు గంటలకొద్దీ పని చేస్తున్నారు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో అతి తక్కువ సమయం మాత్రమే తమ సొంతానికి ఉంచుకుని మిగిలిన కాలమంతా ప్రజా సేవకే కేటాయిస్తున్నారు.

ఇరవై గంటల సీఎం :

ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం తమిళనాడులో అధికారం చేపట్టిన టీవీకే అధినేత విజయ్ ఇరవై గంటలు పనిచేసే సీఎం గా ఆయన మంత్రివర్గంలోని సహచరుడు అధవ్ అర్జున చెప్పారు. విజయ్ రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పనిచేస్తారు అని ఆయన ఇండియా టుడే కాంక్లేవ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దిన చర్య తెల్లవారుజామున నాలుగు గంటలకే మొదలవుతుందని చెప్పారు. వివిధ శాఖ పనితీరుని ఆయన అప్పటి నుంచే ఆరా తీస్తారని అన్నరు. అంతే కాదు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా సీఎం విజయ్ సెక్రటేరియట్ లోనే ఒక్క రోజు కూడా ఆగకుండా పనిచేస్తున్నారు అని చెప్పారు విజయ్ ఒక పని తరువాత మరో పని అంటూ మొత్తం బిజీగానే గడుపుతారు అని అధవ్ అర్జున చెప్పడం జరిగింది. అధవ్ అర్జున చెప్పినది వింటే విజయ్ బాగా కష్టపడుతున్నారు అని భావించాలి. రాజకీయాలకు కొత్త అయిన ఈ ప్రముఖ నటుడు తనకంటూ రాచమార్గం శాశ్వతంగా చేసుకోవడానికి ఈ కసరత్తు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అలాగే ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధత కూడా చాలానే ఉందని అంటున్నారు. ఇది మంచి పరిణామమే అని చెబుతున్నారు.

రేవంత్ సైతం :

ఇక తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నాను అని తాజాగా ఒక సభలో చెప్పారు. తాను ప్రజల కోసమే కష్టపడుతున్నాను అని ఆయన అన్నారు. తాను నిరంతరం తెలంగాణా అభివృద్ధి కోసం ఆలోచిస్తాను అని తనకు కుటుంబం అంటే ప్రజలే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనది సోషల్ జస్టిస్ విధానం అన్నారు. తాను అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకుంటాను అని కూడా అన్నారు. ఆ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి అతి ఎక్కువ గంటలు ఒక రోజులో పనిచేసే సీఎం గా చూడాల్సి ఉంటుంది.

చంద్రబాబు నంబర్ వన్ :

ఈ విషయంలో ఎవరికీ తగ్గని వారు చంద్రబాబు. అసలు ఆయన ఈ విధంగా బెంచ్ మార్క్ ని సెట్ చేసిన వారు. 45 ఏళ్ళ వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగానే రోజుకు 18 గంటలకు పైగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అంతే కాదు ఆ రోజులలో చంద్రబాబుది ఒక నినాదం ఉండేది. తాను నిద్రపోనూ మిమ్మల్ని నిద్రపోనీయను అన్నది. అలా అధికార యంత్రాంగంతో ఆయన పనిచేయించేవారు కూడా. ఇక 76 ఏళ్ళ వయసులో ఈ రోజుకు కూడా చంద్రబాబు గంటల తరబడి పనిచేయగలరు. ఆయన ఆ విషయంలో దేశంలోనే అందరికీ ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. బాబు కంటే చిన్న వయసు వారు ఎక్కువ కష్టపడితే పడొచ్చు కానీ బాబు వారితో సమానంగా పనిచేయడం ఈ ఏజ్ లో అంటే గ్రేట్ అనే చెప్పాలని అంటున్నారు.

మూడు గంటలే నిద్ర :

ఇక దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఈ స్థాయిలో కాకపోయినా రోజులో అత్యధిక సమయం ప్రజా సేవలో ఉంటున్నారు. ఆ విధంగా వారు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పాలి. అదే విధంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే నిద్ర పోతాను అని ఇటీవల తెలియచేశారు. అంటే ఆయన 22 గంటలు రోజులో కష్టపడతారు అన్న మాట. ఇది అతి పెద్ద రికార్డు. పైగా 2001లో గుజరాత్ కి సీఎం అయిన దగ్గర నుంచి మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు, అంతలా నిబద్ధతతో ఆయన పనిచేస్తున్నారు. ఆఖరికి తన తల్లి మరణించిన రోజు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరై ఆ వెంటనే తన దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం అయ్యారు.

అనేక ఇతర కారణాలు :

మరి ఇంతలా దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధాని కూడా కష్టపడుతూంటే ప్రగతి పరుగులు తీయాలి కదా అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. మరి మార్పు వస్తోందా అన్నది మరో ప్రశ్న. అయితే అనూహ్యమైన మార్పు అయితే రాలేదు కానీ ఈ విధమైన పనితీరుతో జవాబుదారీ తనాన్ని వ్యవస్థలలో తేవచ్చు అని మేధావులు అంటున్నారు. అలాగే పనితీరుతో ప్రగతి సాధ్యమేనా అంటే అది కూడా ఆశించిన స్థాయిలో కాదని అంటున్నారు. ప్రగతి పరుగులు పెట్టాలీ అంటే అనేక ఇతర కారణాలు కూడా కలసి రావాలని అంటున్నారు.

Tags:    

Similar News