విజయ్ స్టాండ్ అది...జగన్ చేయలేనిది ఏంటి ?

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా జాతీయ స్థాయిలో విజయ్ తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. అంతే కాదు తమిళనాడులో తన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా మిత్రులను మాత్రం బాగానే సంపాదించుకున్నారు.;

Update: 2026-05-10 00:30 GMT

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా జాతీయ స్థాయిలో విజయ్ తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. అంతే కాదు తమిళనాడులో తన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా మిత్రులను మాత్రం బాగానే సంపాదించుకున్నారు. అది కూడా తన పార్టీ ఏ సిద్ధాంతాలతో అయితే పెట్టారో వాటి విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా నిబ్బరంగా నిలిచి మరీ ఈ మద్దతు సంపాదించారు. నిజం చెప్పాలంటే విజయ్ పార్టీ అన్నా డీఎంకే మద్దతు తీసుకుంటే సులువుగా సీఎం అయిపోయేవారు. కానీ ఎన్డీయేతో ఉన్న అన్నా డీఎంకేతో చెలిమిని ఆయన కాదనునుకున్నారు. అరకొర మెజారిటీ అయినా ఫరవాలేదు, తమ పొలిటికల్ ఫిలాసఫీ ఎక్కడా చెడకూడదు అని విజయ్ భావించారు. అందుకే ఆయన ప్రమాణం ఆలస్యం అయింది కానీ ఆశయం మాత్రం నిలబడింది.

ఒంటరి ఏ మాత్రం కాదు :

విజయ్ ఒంటరిగా పార్టీ పెట్టవచ్చు, పొత్తులు లేకుండా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవచ్చు. కానీ ఆయనకు సీట్లు తగ్గినపుడు ఆయన ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది ఆయన బలమైన పొలిటికల్ స్టాండ్ ని జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. దేశంలో ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ తో విజయ్ స్నేహం నెరిపారు. అలాగే వామపక్ష పార్టీలను తన వైపు తిప్పుకున్నారు. ఇంకా సెక్యులర్ పార్టీలతో దోస్తీ చేశారు. ఇది క్లియర్ కట్ గా విజయ్ రాజకీయ పంధాను సూచిస్తోంది. అంతే కాదు ఆయన లెఫ్ట్ వింగ్ థాట్స్ ని కూడా ఎక్స్ పోజ్ చేస్తోంది. రేపటి రోజున విజయ్ చేసే ఏ రాజకీయ పోరాటం అయినా ఒంటరిగా కాదని కూడా తెలియచేస్తోంది. ఇలా వస్తూనే అలా తనకంటూ సిద్ధాంత భూమికతో కూడిన కూటమిని విజయ్ తమిళ నేల మీద ఏర్పాటు చేసుకున్నారు. అది రాజకీయంగా విజయ్ లాంగ్ ఇన్నింగ్స్ కి ఎంతో ఉపయోగపడే విషయంగా అంతా చూస్తున్నారు.

వైసీపీ ఎందుకలా :

ఇక వైసీపీ ఒక రాజకీయ సిద్ధాంతం తోనే పెట్టబడింది. బడుగులు మైనారిటీలు అణగారిన వర్గాల కోసమే పనిచేస్తామని చెప్పింది. అధికారంలో ఉన్నపుడు కూడా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని జగన్ నినదించారు. కానీ ఆయన ఆ భావజాలం ఉన్న పార్టీలతో మాత్రం స్నేహం చేయలేకపోతున్నారు. విశాలమైన రాజకీయ వేదికను వారితో కలిసి పంచుకోలేకపోతున్నారు. పోనీ అధికారంలో ఉన్నపుడు అయితే అవసరం లేదనుకున్నా విపక్షంలో ఉన్నపుడు అయినా జగన్ తన పొలిటికల్ ఫిలాసఫీకి తగిన మిత్రులుగా వామపక్షాలను అయినా దగ్గర చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమిలో మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి. మరి విపక్షంలో వైసీపీ ఒంటరి పోరు చేస్తోంది. కాంగ్రెస్ తో వైరం అని చెప్పుకున్నా వామపక్షాలతో కలసి అయినా కూటమిగా వైసీపీ ముందుకు వస్తే అధి సిద్ధాంతపరంగా బలమైన గొంతుకంగా మారడమే కాదు రాజకీయంగా కూడా మేలు చేసేదిగా ఉంటుంది అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఆ పని ఎందుకో చేయలేకపోతున్నారు అన్న చర్చ ఉంది.

సింగిల్ అంటూనే :

విజయ్ సింగిల్ గా పోటీ చేసి గెలిచారు అని వైసీపీ తెగ ఊదరగొట్టింది. ఆ పార్టీ అధినేత విజయ్ ని జగన్ తో పోలిక పెట్టి ఎన్నో ఎలివేషన్స్ ఇచ్చుకుంది. కానీ విజయ్ ఇపుడు కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వామపక్షాలను దగ్గర ఉంచుకున్నారు. మరి ఇపుడు కూడా విజయ్ ని జగన్ తో పోలిక పెడతారా ఆయనని ముందు పెట్టి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విజయ్ స్టాండ్ వెరీ క్లియర్ గా ఉందని అది బీజేపీ భావజాల వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. బీజేపీ యాంటీ సెక్షన్లకు విజయ్ కొత్త ఆల్టర్నేషన్ అయ్యారు. ఏపీలో చూస్తే అన్ని పార్టీలూ ఎన్డీయేకు మద్దతుగా నిలబడుతున్నాయి. మరి బీజేపీ యాంటీ సెక్షన్లకు తాను ఉన్నానని వైసీపీ క్లెయిం చేసుకోవాలంటే విజయ్ మార్క్ స్టాండ్ ని గట్టిగా అనుసరించాల్సి ఉంటుంది కదా అని మేధావులు రాజకీయ విశ్లేషకులూ అంటున్నారు. లేకపోతే ఏపీలో కూడా సరికొత్త రాజకీయం వచ్చినా రావచ్చు అన్నదే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News