తమిళనాడులో 'విజయ్' దోబూచులాట.. సర్వే ఫలితాల్లో షాకింగ్ నిజాలు!
ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి.;
ఈ నెల 23న జరగనున్న తమిళనాడు ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. చాలా సంస్థలు అధికార డీఎంకే మళ్లీ గెలుస్తుందని అంచనా వేస్తున్నా, సీ-ఓటర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉన్నాయని చెబుతుండటంతో పోరు ఆసక్తిరేపుతోంది. ప్రధానంగా సినీ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ రాజకీయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని అంటున్నారు. ఆయన చీల్చే ఓట్లే ఫలితాలను నిర్దేశిస్తాయని చెబుతుండటంతో ద్రవిడ నాట రాజకీయం రసకందాయంగా మారింది.
తాజా లెక్క ఇది
సర్వేసంస్థలు భిన్నమైన నివేదికలు విడుదల చేస్తుండటంతో మీడియా సైతం ఒక నిర్ధారణకు రాలేకపోతోందని అంటున్నారు. తాజాగా ఇన్‌సైడ్ ఎలక్షన్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం 234 సీట్లకు గానూ డీఎంకేకు 159-165 సీట్లు వస్తాయని ఈ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 64-70 సీట్లు వచ్చే అవకాశం ఉందని, హీరో విజయ్ పార్టీ టీవీకే 4-6 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.
సీ-ఓటర్ ఏం చెప్పిందంటే..
మెజారిటీ సంస్థలు డీఎంకే మళ్లీ గెలుస్తుందని చెబుతున్నప్పటికీ, సి-ఓటర్ తోపాటు కొన్ని స్థానిక తమిళ మీడియా సంస్థల విశ్లేషణల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపుతోందని, డీఎంకే-అన్నా డీఎంకే మధ్య 'టఫ్ ఫైట్' జరిగే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో దళపతి విజయ్ పార్టీ కారణంగా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొందని కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఆయన 'కింగ్ మేకర్' అవుతారని భారీ అంచనాలు వేస్తున్నాయి.
విజయ్ డిసైడ్ చేస్తారా?
అయితే విజయ్ పార్టీ చీల్చబోయే ఓట్లే తమిళనాడు ఫలితాలను శాసిస్తాయని అంటున్నారు. విజయ్ 4-5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని కొందరు, 20 శాతానికి పైగా ఓట్లు సాధిస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది అన్న విషయాన్ని దళపతి డిసైడ్ చేస్తారని భావిస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య ఓట్లు, సీట్లలో పెద్ద తేడా లేకుండా ఉంటే దళపతి విజయ్ కింగ్ అవుతారని విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా టీవీకే ఓట్ల శాతం భారీగా పెరిగితే అది డీఎంకే కూటమికి నష్టం చేస్తుందా లేక అన్నాడీఎంకే/బీజేపీ కూటమికి నష్టం చేస్తుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు ఉన్నాయి. మొత్తానికి ద్రవిడ రాజకీయం ప్రస్తుతానికి దళపతి చుట్టూ తిరుగుతోందని అంటున్నారు.