విజయ్ కు ‘బీజేపీ’ అండ అవసరం ఎంతో అర్థమైందా?

కొన్ని పరిణామాలు అనూహ్య రాజకీయ మార్పులకు కారణం అవుతుంటాయి. తాజాగా తమిళనాడులో అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది;

Update: 2025-10-05 08:20 GMT

కొన్ని పరిణామాలు అనూహ్య రాజకీయ మార్పులకు కారణం అవుతుంటాయి. తాజాగా తమిళనాడులో అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. భారీ ఎత్తున అభిమానుల ఆదరణ ఉన్న ప్రముఖ హీరో విజయ్.. ఈ మధ్యనే రాజకీయ రంగ ప్రవేశం చేయటం తెలిసిందే. టీవీకే పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకునే పార్టీగా ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఇలాంటి వేళ.. పార్టీ నిర్వహించిన కరూర్ సభలో అనూహ్య విషాదానికి కారణమైన సంగతి తెలిసిందే. సభలో జరిగిన తొక్కిసలాటతో 41 మంది మరణించటం.. అధికార డీఎంకే సర్కారు నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల వేళ.. కమలనాథుల నుంచి విజయ్ కు అందుతున్న భరోసా.. ఆయన మైండ్ సెట్ లో మార్పునకు కారణమవుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే బీజేపీకి మిత్రుడిగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకేకు తోడు విజయ్ పార్టీ తోడైతే.. రాజకీయ సమీకరణాలు మొత్తంగా మారిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. కరూర్ విషాదం తర్వాత.. విజయ్ ఒంటరి వాడు కాదని.. డీఎంకే సర్కారు అతడ్ని టార్గెట్ చేస్తే.. అందుకు బీజేపీ చూస్తూ ఊరుకోదన్న సందేశాన్ని విజయ్ కు పంపినట్లుగా సమాచారం. ఈ పరిణామాలు విజయ్ ఆలోచల్లో మార్పు వచ్చేలా చేసిందంటున్నారు. అంతేకాదు.. డీఎంకే వేసే ఎత్తులకు ఎలా రియాక్టు కావాలన్నది తమకు వదిలేయాలని చెబుతూ.. విజయ్ ను సహనంతో ఉండాలన్న సూచన చేసినట్లుగా తెలుస్తోంది.

కరూర్ విషాద ఉదంతం తనను ఎంతో బాధించిందని.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తనకు బాసటగా నిలిచిన రాజకీయ పార్టీలకు థ్యాంక్స్ చెబుతూ విజయ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరూర్ విషాదానికి ముందు వరకు తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పదే పదే ప్రకటించటం తెలిసిందే. తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో కేంద్రంలో బలమైన బీజేపీ బలం ఎంతన్న అవసరాన్ని విజయ్ గుర్తించినట్లుగా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే సమయంలో తమిళనాడులో పాగా వేయాలని తపిస్తున్న బీజేపీకి.. కరూర్ విషాద ఉదంతంలో విజయ్ కు అండగా నిలవటం ద్వారా.. డీఎంకే.. విజయ్ పార్టీతో కలిసి ఏపీలో మాదిరి కూటమిగా కలిసి పోటీ చేస్తే.. ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల జరిగిన పరిణామాల్ని గుర్తు చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఉదంతం తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే టీం కరూర్ లో పర్యటించటమేకాదు.. తొక్కిసలాట విషాద వేళ కేవలం టీవీకేను మాత్రమే తప్పు పట్టటం సరికాదని.. ప్రభుత్వ నిర్వహణ లోపాలు కూడా ప్రధాన కారణంగా వ్యాఖ్యానించటం తెలిసిందే.

కరూర్ విషాద ఎపిసోడ్ లో అధికార డీఎంకే విజయ్ పార్టీని టార్గెట్ చేస్తే.. అందుకు భిన్నంగా బీజేపీ అండ్ కో మాత్రం విజయ్ ను కాకుండా ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కారుపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. అదే సమయంలో తనకు మిత్రుడైన అన్నాడీఎంకేతో ఉన్న పొత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమతో జట్టు కట్టేలా విజయ్ ను తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని జాగ్రత్తగా అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి. కరూర్ తొక్కిసలాట ఉదంతానికి ముందు.. తర్వాత అన్న విషయంలో విజయ్ లో మార్పు మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నమాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే చెప్పాలి.

Tags:    

Similar News