తమిళ రాజకీయాల్లో 'ఫోర్జరీ' మంటలు: విజయ్ టీవీకే పార్టీపై దినకరన్ పోలీస్ ఫిర్యాదు!
దినకరన్ ఆరోపణలను టీవీకే శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. కేవలం ఆరోపణలతో ఆగకుండా వారు ఒక వీడియో ఆధారాన్ని విడుదల చేశారు.;
తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీపై.. ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునే క్రమంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వివాదానికి కేంద్ర బిందువు.. ఎస్. కామరాజ్ లేఖ
అన్నాడీఎంకే నుంచి విడిపోయిన తర్వాత దినకరన్ స్థాపించిన ఏఎంఎంకే పార్టీకి ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనే ఎస్. కామరాజ్. ఇటీవల టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో కామరాజ్ కూడా విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఒక లేఖ వెలుగులోకి రావడం రాజకీయంగా పెను దుమారం రేపింది.
దినకరన్ ఈ లేఖపై తీవ్రంగా స్పందిస్తూ "మా పార్టీ ఎమ్మెల్యేను టీవీకే నేతలు ప్రలోభపెట్టడమే కాకుండా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్‌కు నకిలీ మద్దతు లేఖను సమర్పించారు" అని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేను ఎక్కడో దాచిపెట్టారని.. ఆయన ఆచూకీ తెలియడం లేదని పేర్కొంటూ దినకరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో వార్.. టీవీకే గట్టి కౌంటర్
దినకరన్ ఆరోపణలను టీవీకే శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. కేవలం ఆరోపణలతో ఆగకుండా వారు ఒక వీడియో ఆధారాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాను స్వచ్ఛందంగానే విజయ్ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ నిర్ణయానికి దినకరన్ కూడా ముందుగానే అంగీకరించారని కామరాజ్ ఆ వీడియోలో వ్యాఖ్యానించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఎమ్మెల్యే యూ-టర్న్.. పీక్స్‌కు చేరిన గందరగోళం
టీవీకే వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే సీన్ మరోసారి రివర్స్ అయ్యింది. ఎమ్మెల్యే కామరాజ్ హఠాత్తుగా మరో ప్రకటన చేస్తూ.. తాను టీవీకేకు ఎలాంటి మద్దతు ప్రకటించలేదని.. ఇప్పటికీ ఏఎంఎంకే లోనే ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో అసలు ఆ వీడియో ఎప్పుడు తీశారు? అది ఒత్తిడితో తీయించినదా లేక డీప్ ఫేక్ సాంకేతికతతో సృష్టించినదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపు వీడియో సాక్ష్యం.. మరోవైపు ఎమ్మెల్యే మాట మార్చడం వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గవర్నర్ పాత్రపై ఉత్కంఠ
ప్రస్తుతం ఈ వ్యవహారం గవర్నర్ కార్యాలయానికి చేరుకుంది. ఫోర్జరీ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్న దినకరన్ ఆరోపణలపై రాజ్ భవన్ నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ లేఖ నిజంగానే ఫోర్జరీ అని తేలితే టీవీకే పార్టీ చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. "తమిళ రాజకీయాల్లో బలపడాలని చూస్తున్న విజయ్ పార్టీకి ఇది మొదటి పెద్ద సవాలు. అటు దినకరన్ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతుంటే, మధ్యలో ఎమ్మెల్యేల మద్దతు అంశం ప్రహసనంగా మారింది.
పోలీసుల దర్యాప్తులో ఈ సంతకం అసలుదా లేక నకిలీదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కామరాజ్ నిజంగా ఎవరి పక్షాన ఉన్నారో తేల్చడానికి 'పరేడ్' నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఏదేమైనా ఈ 'ఫోర్జరీ' వివాదం తమిళనాడులో రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిక్సూచిలా మారింది. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా నెట్టుకొస్తారో దినకరన్ తన పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.