'దళపతి' ప్రజాస్వామ్యం: ఒకే ఒక్కడున్నా.. ఒకే విలువ!

రాజకీయాల్లో సాధారణంగా ‘మెజారిటీ’ అనేదే ఒక పెద్ద బూచీ. వంద సీట్లు ఉన్న పార్టీ నాయకుడి గొంతు సభలో వినబడుతుంది, ఒక్క సీటు ఉన్న పార్టీ నాయకుడి గొంతు నొక్కబడుతుంది.;

Update: 2026-05-12 09:31 GMT

తమిళనాడు శాసన సభలో విజయ్ మొదటి స్పీచ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన వేష భాషలు, అందులోని భావాలపై తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలు కూడా బయటకు కాకున్నా లోలోపల సంతోషంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ ప్రసంగంలో ‘సమానం’ అన్న పదం పలు సార్లు రావడమే ఇందుకు నిదర్శనం.

రాజకీయాల్లో సాధారణంగా ‘మెజారిటీ’ అనేదే ఒక పెద్ద బూచీ. వంద సీట్లు ఉన్న పార్టీ నాయకుడి గొంతు సభలో వినబడుతుంది, ఒక్క సీటు ఉన్న పార్టీ నాయకుడి గొంతు నొక్కబడుతుంది. కానీ, తమిళనాడు రాజకీయ తెరపైకి కొత్తగా వచ్చిన 'దళపతి' విజయ్ మాత్రం తన టీవీకే మార్కు ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. ‘బలం ఉన్నవాడిదే మాట కాదు.. భావం ఉన్నవాడిదే బాట’ అన్నట్లుగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చిన్న పార్టీల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందరూ తలో దారి చూసుకుంటున్న వేళ, ‘ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే.. మాకు అందరూ సమానమే’ అని చెప్పడం వినడానికి బాగానే ఉన్నా, ఇది నిజంగానే 'మంచి'ని స్వీకరించడమా లేక 'మద్దతు'ను కూడగట్టడమా అన్నది ఇప్పుడు అసలైన పాయింట్!

అసెంబ్లీలో అగ్రతాంబూలం..

తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతిచ్చిన కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలను ఉద్దేశిస్తూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘మీ పార్టీకి ఒక్క అభ్యర్థి ఉన్నా సరే, మీ అభిప్రాయానికి టీవీకే అభిప్రాయంతో సమానంగా విలువ ఉంటుంది’ అని విజయ్ ప్రకటించారు. అంటే, భవిష్యత్తులో అసెంబ్లీలో 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక్కడంటే ఒక్కడున్న చిన్న పార్టీ ఎమ్మెల్యే మరోవైపు ఉన్నా.. త్రాసులో ఇద్దరి తూకం సమానమన్నమాట! ఇది విన్న సీనియర్ రాజకీయ నేతలు ‘మరీ ఇంతటి ఉదారత్వమా?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమాలో హీరో అందరినీ సమానంగా చూసినట్లు, రియల్ పాలిటిక్స్‌లో కూడా అందరికీ 'ఈక్వల్ సీటు' ఇస్తానని విజయ్ హామీ ఇస్తున్నారు.

మంచికి వెల్కమ్..

సూచనల విషయంలో విజయ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ‘మంచి సూచనలు స్వీకరించబడతాయి, చెడు సూచనలు తిరస్కరించబడతాయి’ అని తేల్చేశారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఏది మంచి? ఏది చెడు? అనేది డిసైడ్ ఎవరు చేస్తారు. ఖచ్చితంగా అది విజయ్ వద్దే ఉంటుంది. అంటే, చిన్న పార్టీలు ఇచ్చే సలహా టీవీకే సిద్ధాంతాలకు సరిపోతే అది 'మంచి', లేకపోతే అది 'చెడు' అన్నమాట. ‘నీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నీకుంది.. అది వినాలా వద్దా అని నిర్ణయించే అధికారం నాకుంది’ అనే ఈ సాఫ్ట్ డిక్టేటర్‌షిప్ వెనుక ఒక సినిమాటిక్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ ఒక్క అభ్యర్థి పార్టీకి.. జాక్‌పాట్ తగిలినట్టేనా?

ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పార్టీలు సాధారణంగా పెద్ద పార్టీల నీడలో బతికేస్తుంటాయి. కానీ విజయ్ మాత్రం వారికి ‘టీవీకేతో సమాన విలువ’ అని ఆఫర్ ఇవ్వడంతో, ఆ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు తనను తాను ఒక ‘కింగ్ మేకర్’ లా ఫీలవుతున్నాడు. అసెంబ్లీలో తన వాయిస్ కి కూడా విజయ్ వాయిస్ అంత వెయిట్ ఉంటుందని తెలియడంతో, ఆ ఒక్క అభ్యర్థి పార్టీలు ఇప్పుడు తమ మేనిఫెస్టోలను మళ్లీ తిరగరాసుకునే పనిలో పడ్డాయి. ఒకే ఒక అభ్యర్థి ఉన్నా సరే, పది లక్షల ఓట్లు తెచ్చుకున్న పార్టీతో సమానంగా ట్రీట్ చేస్తామనడం, రాజకీయాల్లో ఒక వింతైన 'సోషలిజం' అని చెప్పాలి.

వ్యూహాత్మక వినయం..

విజయ్ ఈ స్థాయిలో తగ్గి ఉండడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందనేది విశ్లేషకుల మాట. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో, ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోవడం ద్వారా తన ఇమేజ్ ను 'ప్రజాస్వామ్యవాది'గా మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. ‘నేను హీరోని, నా మాటే వినాలి’ అని కాకుండా ‘మనం అందరం కలిసి నడుద్దాం’ అని చెప్పడం ద్వారా చిన్న చిన్న శక్తులను కూడా తన వైపు తిప్పుకుంటున్నారు. అయితే, ఈ 'సమాన విలువ' అనేది అసెంబ్లీలో బిల్లుల ఆమోదం దగ్గర కూడా అలాగే ఉంటుందా? కాలమే నిర్ణయించాలి.

మొత్తానికి, విజయ్ ఈ 'సమానత్వ' రాజకీయం చూస్తుంటే.. ‘స్క్రీన్ మీద హీరో అందరినీ రక్షించినట్లు, అసెంబ్లీలో అందరినీ గౌరవించేస్తారన్నమాట" అనిపిస్తోంది. ఒక్క అభ్యర్థి ఉన్నా సరే రాజభోగం కల్పిస్తామంటున్న ఈ ఆఫర్ చూసి, ఇతర రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు కూడా తమిళనాడుకు షిఫ్ట్ అయిపోతాయేమో!

Tags:    

Similar News