కరూర్ తొక్కిసలాట... విజయ్ ఆ రేంజ్ లో ఎదుర్కోబోతున్నారా..!
అవును... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ కీలక అడుగులు వేస్తోందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.;
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం (టీవీకే)తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. కరూర్ లో చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ సమయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ) ఎంట్రీ ఇవ్వడం.. ఆయనను ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించడం వంటి పరిణామాల నడుమ మరో సంచలన చర్చ తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్!
అవును... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ కీలక అడుగులు వేస్తోందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ ను రెండోసారి ప్రశ్నించిన అధికారులు.. సుమారు 90 ప్రశ్నలతో కూడిన జాబితాను సిద్ధం చేసి, పలు అంశాలపై క్లారిటీ కోరినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఛార్జ్ షీట్ లో విజయ్ పేరు చర్చకు వస్తోంది!
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఛార్జిషీట్ ను ఫిబ్రవరి రెండోవారంలో సీబీఐ దాఖలు చేయనుందని అంటున్నారు. ఈ ఛార్జ్ షీట్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ తోపాటు.. పోలీస్ అధికారుల పేర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. హత్యకు సమానం కాని నరహత్య కింద విజయ్ పై పలు సెక్షన్లు మోపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
కాగా... గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన టీవీకే రాజకీయ ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు! ఈ క్రమంలో.. ఈ ఘటనపై విచారణను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది అక్టోబర్ లో చేపట్టింది. ఈ క్రమంలో... ఇది వరకు ఒకసారి విజయ్ ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. తాజాగా మరోసారి సోమవారం విచారించారు.
ఈ సందర్భంగా... ఆ ఘటన జరిగిన రోజున మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్.. రాత్రి 7 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారని.. ఈ ఆలస్యం వల్ల జనం భారీగా పెరిగిపోయి తొక్కిసలాట జరిగిందని సీబీఐ భావిస్తోందని అంటున్నారు. మరోవైపు జనం అదుపు తప్పుతున్నప్పటికీ విజయ్ ప్రసంగాన్ని కొనసాగించారని.. జనసమూహాన్ని నియంత్రించడానికి పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న చర్యలు లేవని అంటున్నారని తెలుస్తోంది!
అంతకంటే ముందు... ఈ తొక్కిసలాటకు కారణం సభకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే అని.. వారికి ఆహారం, నీరు, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలను టీవీకే ఏర్పాటు చేయలేకపోయిందని.. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పిందని.. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించగా... ఇది పూర్తిగా అధికార డీఎంకే కుట్ర అని, పోలీసులే సరైన క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని విజయ్ అన్నారు!