మౌనమేల స్వామీ...ఆయన తీరే అతి పెద్ద చర్చ !
విజయనగరం జిల్లాలో వైసీపీలో చేరిన వారిలో మొదటిగా ఆయనే ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.;
వైసీపీలో అంతా ఇపుడు లైన్ లోకి వస్తున్నారు. హానీమూన్ పీరియడ్ అయిపోయింది అంతా కలసి జనంలోకి రావాలని పార్టీని పటిష్టం చేయాలని అధినేత జగన్ పదే పదే దిశానిర్దేశం చేసిన మీదట నెమ్మదిగా అంతా బయటకు వస్తున్నారు. చాలా మంది అయితే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ఆ సీనియర్ నాయకుడు ఇంకా మౌన ముద్ర వీడడం లేదు. ఇంతకీ ఆయన ఎవరంటే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. అంతా స్వామి అని పిలుచుకునే పెద్దాయన ఇంకా రంగంలోకి దిగకపోవడం మీద రకరకాలైన చర్చ అయితే సాగుతోంది.
పునాది రాయి ఆయనే :
విజయనగరం జిల్లాలో వైసీపీలో చేరిన వారిలో మొదటిగా ఆయనే ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి వేరు పడి మాజీ ఎమ్మెల్యేగా తన పలుకుబడిని ఉపయోగించి ఫ్యాన్ పార్టీకి జవసత్వాలు కల్పించే విషయంలో స్వామి కష్టపడ్డారు. ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా జగన్ ఇచ్చారు. ఆనాడు ఉమ్మడి ఏపీ పీసీసీ చీఫ్ గా బొత్స సత్యనారాయణ ఉండేవారు. ఆ తరువాత బొత్స వైసీపీలో చేరడంతో స్వామి రాజకీయంగా కొంత తగ్గిపోయారు అని గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రాధాన్యత :
జగన్ అయితే స్వామికి తగిన గుర్తింపు ఇచ్చారని చెబుతారు. తన పాదయాత్రలో స్వామిని విజయనగరం నుంచి అభ్యర్థిగా ప్రకటించి అగ్ర తాంబూలం ఇచ్చారు. ఆ విధంగానే ఎమ్మెల్యే కూడా 2019 ఎన్నికల్లో స్వామి అయ్యారు. తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి మీద స్వామి ఆశ పెట్టుకున్నారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కింది. దాంతో స్వామి అసంతృప్తితో కొన్నాళ్ళు దూరంగా ఉండిపోయారు. ఇక 2022లో విస్తరణలో చాన్స్ తప్పకుండా వస్తుందని భావించినా కూడా దక్కలేదు. దాంతో ఆయన మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఆయనకు ఉప సభాపతి పదవి ఇచ్చి కొంత వరకూ అలక తీర్చారు. ఇక 2024లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అనుకున్న స్వామికి ఏకంగా ఎదురుదెబ్బ తగిలింది. కూటమి అధికారంలోకి రావడంతో ఆయన పూర్తిగా రాజకీయ వైరాగ్యంలో పడ్డారని చెబుతారు.
ఆయన మీద గుస్సా :
ఇదిలా ఉంటే తాను మాజీ అయిపోయినా పార్టీలో బొత్స ఎమ్మెల్సీగా లీడర్ ఆఫ్ అపొజిషన్ గా కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉండడంతో స్వామి అయితే కొంతవరకూ రగిలిపోతున్నారు అని అంటున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా చేయడంలో ఆనాడు బొత్సది కీలక పాత్ర అని స్వామి నమ్ముతూ ఉంటారు. ఇపుడు కూడా జిల్లాలో బొత్సదే ఆధిపత్యంగా ఉందని ఆయన మండిపోతున్నారు అని అంటున్నారు. దాంతో ఎందుకొచ్చిన కంచి గరుడ సేవ అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఆ ప్రచారం కూడా :
మరో వైపు చూస్తే ఆయన టీడీపీలో చేరుతారు అని ఆ మధ్యన ప్రచారం సాగింది. అయితే పూసపాటి అశోక్ గజపతిరాజు మాత్రం ఈ రకమైన చేరికలను వద్దు అని ప్రోత్సహించలేదని అంటారు ఇపుడు పెద్దాయన గవర్నర్ గా గోవాకు వెళ్ళిపోవడంతో స్వామి వర్గం చూపు టీడీపీ మీద ఉందని ప్రచారం అయితే సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తే రాజకీయ వారసురాలు అయిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి తగిన ప్రాధాన్యత ఇస్తే కనుక పార్టీ మారేందుకు ఆయన సిద్ధమని అంటున్నారు. మరి ఆయన మౌనం వెనక ఇంతటి వ్యూహం ఉందా లేదా ఇవన్నీ పుకార్లుగానే చూడాలా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా స్వామి ఇదేమి మౌనమని అంతా అంటున్నారు.