వాసిరెడ్డి పద్మ రాజకీయ వాస్తు బాలేదా ?
వాసిరెడ్డి పద్మ పేరు చెప్పగానే ఒక ఫైర్ బ్రాండ్ లేడీ కళ్ళ ముందు కదులుతారు. ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే చాలు నూరు శాతం న్యాయం చేస్తారు.;

వాసిరెడ్డి పద్మ పేరు చెప్పగానే ఒక ఫైర్ బ్రాండ్ లేడీ కళ్ళ ముందు కదులుతారు. ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే చాలు నూరు శాతం న్యాయం చేస్తారు. ఒక కొమ్ములు తిరిగిన లాయర్ సైతం వాదించలేని విధంగా సొంత పార్టీని డిపెండ్ చేసుకొస్తారు. అదే సమయంలో ప్రత్యర్థిని చెడుగుడు ఆడతారు. ఆమె మాటకారితనం, సబ్జెక్ట్ మీద ఉన్న పట్టు వల్లనే ఆమెకు వైసీపీ ఎంతో కీలక స్థానం ఇచ్చింది.
వైసీపీ 2019లో అధికారంలోకి రావడంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ దక్కితే చట్ట సభలోకి వెళ్ళాలన్న వాసిరెడ్డి పద్మ ఆశలు అలాగే ఉండిపోయాయి. ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వారు.
ఆమె అక్కడ ఎమ్మెల్యే టికెట్ ని 2019, 2024లోనూ గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ అక్కడ సీనియర్ నేత ఉదయభాను ఉండటం చేత వైసీపీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆమె 2024 లో ఎన్నికల ముందే తీవ్ర అసంతృప్తి చెందారు అని చెబుతారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకూ ఆమె ఓపిక పట్టారు.
ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కాగానే ఆమె వైసీపీని వీడారు. ఈ సందర్భంగా జగన్ మీద ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. జగన్ ని నిందిస్తూ కూటమి వైపుగా అడుగులు వేశారు. ఆమె ఫస్ట్ ఆప్షన్ టీడీపీ. అలా ఆమె విజాయవాడ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు అయితే సక్సెస్ కాలేదని తాజా సమాచారంగా ఉంది.
ఆమె చేరికకు లోకేష్ అంగీకరించినా చంద్రబాబు నో చెప్పారని ప్రచారం సాగుతోంది. వాసిరెడ్డి పద్మ లాంటి ఫైర్ బ్రాండ్ ని వైసీపీలో ఉంటూ తమ మీద తీవ్ర విమర్శలు చేసిన వారిని చేర్చుకుంటే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించే బాబు నో చెప్పారని అంటున్నారు. పైగా ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన కార్యకర్తలు ఎక్కువ మంది ఆమె చేరికకు వ్యతిరేకంగా ఉన్నారని పార్టీ అభిప్రాయ సేకరణలో తేలింది అని అంటున్నారు.
మొత్తానికి ఆమెకు టీడీపీలో చేరేందుకు డోర్స్ క్లోజ్ అని అంటున్నారు. జనసేనలో చేరుదామని ఆమె అనుకున్నా అక్కడ కూడా అనుకూలత లేదని అంటున్నారు. పైగా వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేటకే చెందిన ఉదయభాను జనసేనలో ముందే చేరడంతో తాను చేరినా ఉపయోగం లేదని ఆమె భావించారు అని అంటున్నారు.
ఇక ఆమెకు మిగిలింది బీజేపీలో చేరడమో లేక ఖాళీగా ఉండిపోవడమో అని అంటున్నారు. బీజేపీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే బీజేపీలో ఎవరు చేరినా కండువా కప్పుతారు కానీ పదవుల విషయం వచ్చేసరికి మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీలో పదేళ్ళ పాటు కొనసాగిన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీ ద్వారానే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. కానీ వైసీపీని వీడిన ఆమె రాజకీయ భవిష్యత్తు ఇపుడు ఏ వైపున సాగుతుందో అన్న చర్చ అయితే ఉంది.