పదవి కోసం జగన్ కు సాష్టాంగ నమస్కారం చేయాలన్నారంటూ వాసంశెట్టి సంచలనం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించారు. ఘనంగా పుట్టిన రోజు వేడుకల్ని పూర్తి చేశారు.;

Update: 2025-04-21 04:48 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించారు. ఘనంగా పుట్టిన రోజు వేడుకల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు మాత్రమే కాదు.. ఇప్పటివరకు బయటకు రాని కొన్ని అంశాలు ప్రసంగాల రూపంలో వెలుగు చూశాయి. అయితే.. అవన్నీవైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉండటం విశేషం. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి పుట్టిన రోజు.. అందునా 75వ జన్మదినోత్సవం లాంటివి జరుగుతున్నప్పుడు.. చంద్రబాబు కీర్తిని మరింత పెంచేలా మాటలు చెప్పుకోవటం కనిపిస్తుంది.

అందుకు భిన్నంగా జగన్ వ్యవహారశైలి.. పార్టీ నేతలతో ఆయన వ్యవహరించే తీరు చర్చకు వచ్చేలా మాట్లాడటంతో ఆ వార్తల జోరు పెరిగింది. ఈ కోవకే చెందుతుంది ఏపీ కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు వైసీపీలో క్రియాశీలంగా ఉన్న తన విషయంలో ఏం జరిగింది? జగన్ తో ఎలా ఉండాలో పార్టీ నేతలు ఏం చెప్పారు? లాంటి అంశాల్ని ఆయన బయటపెట్టి హాట్ టాపిక్ గా మారారు.

పదేళ్లు పార్టీలో క్రియాశీలంగా ఉన్న తర్వాత.. చివర్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పిన పార్టీ నేతలు.. అధినేత జగన్ వద్దకు వెళ్లి కలవాలని చెప్పినట్లుగా వెల్లడించారు. ‘మిథున్ రెడ్డిని కలిశాక ధనుంజయరెడ్డి దగ్గరకు వెళితే జగన్ కు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పారు. దాంతో కంగుతిన్నా. మీ జిల్లాకు చెందిన మంత్రి వేణు ఇలానే చేస్తారని చెప్పటంతో ఆశ్చర్యపోయా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రమే కాదు వైసీపీ నేతలకూ చుక్కలు చూపించారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ బయటకు రాకుండా డార్క్ రూమ్ లో కూర్చొని నలుగురితో వ్యవస్థల్ని నడిపించారని.. మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని భావించినట్లు చెప్పారు. విశాఖపట్నంలో పదవీ ప్రమాణం చేయటానికి సిద్ధమైనట్లుగా చెప్పారు. చివర్లో తనకు ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ పదవిని తీసుకొని ఉంటే.. ప్రజలు రాళ్లతో కొట్టేవారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Tags:    

Similar News