వంగవీటి ఇక తేల్చుకోవాల్సిందే ?
వంగవీటి రాధా క్రిష్ణ ఉరఫ్ రాధా ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. పదవుల విషయంలో ఆయన విసిగి వేసారి ఉన్న సంగతి తెలిసిందే.;
వంగవీటి రాధా క్రిష్ణ ఉరఫ్ రాధా ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. పదవుల విషయంలో ఆయన విసిగి వేసారి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి పదహారేళ్లుగా ఆయన అధికార వియోగం అనుభవిస్తున్నారు. 2004 నుంచి 2009 దాకా మాత్రమే విజయవాడ తూర్పు నుంచి చట్ట సభకు రాధా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఆయన రాజకీయం మొత్తం అయోమయంలో పడిపోయింది. ఈ మధ్యలోనే ప్రజారాజ్యం, వైసీపీ మీదుగా టీడీపీ గూటికి చేరుకున్నారు. గత ఏడేళ్ళుగా టీడీపీలో రాధా కొనసాగుతున్నా రెండేళ్ళుగా టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా పదవులు అయితే పలకరించలేదు దాంతో రాధాతో పాటు ఆయన అనుచరులు కూడా రాజకీయ వైరాగ్యంలో పడిపోయారు.
ఎమ్మెల్సీగానేనా :
ఈ నేపథ్యంలో రాధా ఈ మధ్య చంద్రబాబుని కలసి వచ్చారు. ఆయనకు పదవిని ఇచ్చేందుకు అధినాయకత్వం పూర్తి హామీ ఇచ్చింది అని చెబుతున్నారు. అయితే నిన్నటి దాకా దారి వేరు. ఇపుడు మరో రకంగా పరిస్థితి ఉంది అని అంటున్నారు. డీలిమిటేషన్ బిల్లు కనుక పార్లమెంట్ లో పాస్ అయితే రాధాకి విజయవాడలో కోరుకున్న చోట సీటు దక్కేది. కానీ ఇపుడు ఆ అవకాశం లేదని అంటున్నారు. అయితే 2029 దాకా వేచి చూస్తే ఉన్న 175 సీట్లలో ఎక్కడో ఒక చోట టికెట్ ఇచ్చి అకామిడేట్ చేయవచ్చు అన్నది కూడా ఉంది. కానీ అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చెప్పలేరు. కాబట్టి తొందరలో ఖాళీ అయ్యే శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినాయకత్వం చెబుతోంది అని అంటున్నారు.
వేచి ఉండకుండా వెంటనే :
ఇన్నేళ్ళ నిరీక్షణ ఫలించినట్లుగా చేతిలో ఎమ్మెల్సీ పదవి ఉంది అని అంటున్నారు. రాధా కనుక కోరుకుంటే టీడీపీ అధినాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెద్దల సభకు సాదరంగా స్వాగతం పలుకుతుంది అని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ కాదు నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలని అనుకుంటే మాత్రం రాధా 2029 దాకా ఎదురు చూడకతప్పదని అంటున్నారు. పోనీ అంతవరకూ చూసినా కూడా తీరా టికెట్ ఏదైనా సమీకరణల వల్లనో పొత్తుల వల్లనో మిస్ అయితే అది కూడా మరింత బాధ అని అంటున్నారు. అందుకే చేతిలో ఉన్న పదవిని తీసుకుని రాజకీయంగా సరికొత్త ఇన్నింగ్స్ ని రాధా ప్రారంభిస్తే బాగుంటుందని అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు. మరి ఏ విషయం అయినా నిర్ణయం తీసుకోవాల్సింది రాధాయే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.