రాజకీయాల్లోకి వంగవీటి కుమార్తె...ఏ పార్టీ అంటే ?
రంగా కుమారుడు రాధా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. ఇక ఇపుడు ఆయన కుమార్తె సైతం రాజకీయంగా అడుగులు వేస్తున్నారు అని చర్చ సాగుతోంది.;
వంగవీటి అన్నది ఎపుడూ ఒక పొలిటికల్ వైబ్రేషన్ గానే ఉంటుంది. ఒకే ఒకసారి కేవలం మూడున్నరేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధా హత్య చేయబడ్డారు. ఆయన మరణించి నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఇంకా జనం గుండెలలో ఉన్నారు. రంగా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ విదేశాలలో సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే రంగా పేరుతో పొలిటికల్ గా పార్టీలు లబ్ది పొందాయి కానీ ఆ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. రంగా కుమారుడు రాధా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. ఇక ఇపుడు ఆయన కుమార్తె సైతం రాజకీయంగా అడుగులు వేస్తున్నారు అని చర్చ సాగుతోంది.
పాలకొల్లులో సందడి :
వంగవీటి రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో తాజాగా పాలకొల్లులో జరిగిన కార్తీక వన సమారాధనలో రంగా కుమార్తె ఆశా కిరణ్ కనిపించారు. ఆమె రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాను ఇక మీదట పబ్లిక్ లైఫ్ లో ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తాను అని చెప్పారు. తన తల్లి అన్న కోసం గతంలో రాజకీయ ప్రచారం చేసినా కుటుంబ పరమైన కారణాల వల్ల తాను కొన్నాళ్ళు దూరంగా ఉన్నాను అని చెప్పారు. ఇపుడు తగిన సమయం తనకు దొరికింది కాబట్టి ప్రజా సేవ కోసం ముందుకు వచ్చాను అని చెప్పారు.
అదే లక్ష్యం అంటూ :
రంగా అభిమానులు అందరినీ ఏకం చేయడం రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేయడం తన లక్ష్యమని ఆమె చెప్పారు. ఇక మీదట రంగా రాధా సంఘం పెద్దలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనలు సలహాలతో ముందుకు సాగుతాను అని ఆమె చెప్పారు. రంగా అభిమానులు విదేశాలలో కూడా ఎక్కువగా ఉన్నారని అన్నారు. రంగాకు కులం మతం ప్రాంతం అన్నది లేదని ఆయన అందరి వారు అని ఆశాకిరణ్ చెప్పారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసమే తాను ప్రజా జీవితంలోకి వస్తున్నాను అని అన్నారు.
రాజకీయాల మీద :
అయితే రాజకీయాల గురించి ఇపుడే చెప్పేది లేదని ఆమె అన్నారు. తాను ప్రస్తుతం మిత్ర మండలి తరఫునే పనిచేస్తాను అన్నారు. అయితే సమయం వచ్చినపుడు తాను ఆ విషయం మీడియా ముఖంగా చెబుతాను అని చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది అపుడే చర్చకు తావిస్తోంది. ఆమె జనసేనలో చేరుతారు అని ఒక వైపు ప్రచారంలో ఉంటే ఆమె వైసీపీలో చేరుతారు అని మరో వైపు ప్రచారంలో ఉంది. ఆమె విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చే ఎన్నికల్లో ప్పోటీ చేస్తారు అని అంటూంటే కాదు ఆమె ఎంపీగా పోటీ చేస్తారు అని ఇంకో ప్రచారం ఉంది. ఏది ఏమైనా రంగా కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజా సేవలో ఉంటాను అని చెప్పడం అయితే ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు తావిస్తోంది.
రంగా అభిమానుల కోసం :
మరో వైపు చూస్తే రంగా అభిమానులు అయితే తమ నాయకుని వారసులు అగ్ర భాగన నిలవాలని కోరుకుంటూ వస్తున్నారు. రాధా అయితే టీడీపీలో ఉన్నారు కానీ ఆయనకు పెద్దగా ప్రాధ్నాయత లభించడం లేదని ప్రచారంలో ఉంది. మరో వైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గం పాత్ర ఎంతో కీలకంగా ఉంది. దాంతో ఆ సామాజిక వర్గం నుంచి వంగవీటి ఇంటి ఆడబిడ్డగా ఆశా కిరణ్ సీరియస్ గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం గణనీయమైన ప్రభావం అయితే కోస్తా ప్రాంతాలలో చూపించవచ్చు అన్నది కూడా విశ్లేషణగా ఉంది. చూడాలి మరి రానున్న కాలంలో ఆశా కిరణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో. ఏమిటి అన్నది.