బిగ్ బ్రేకింగ్ : వల్లభనేని వంశీకి బెయిల్

గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాపు కేసులో బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న దరఖాస్తును ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు పరిష్కరించింది.;

Update: 2025-05-13 14:28 GMT

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి ఎట్టకేలకు బెయిలు మంజూరైంది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న వంశీకి మంగళవారం బెయిలు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ సుమారు 90 రోజులుగా జైలులో ఉన్నారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉండటంతో ఆయన ఈ రోజో, రేపో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి ఎట్టకేలకు బెయిలు లభించింది. గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాపు కేసులో బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న దరఖాస్తును ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు పరిష్కరించింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెయిన్ టార్గెట్ గా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనూహ్యంగా కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యారు.

ఫిబ్రవరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉప సంహరించుకుంటూ ఫిర్యాదుదారు సత్యవర్థన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. అయితే సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి భయపెట్టి కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో హైదరాబాదులో ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. ఆ తర్వాత ఆయనపై భూకబ్జాతోపాటు అక్రమ మైనింగు వంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అన్నింటిలోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఇంతవరకు కిడ్నాప్ కేసు మాత్రమే పెండింగులో ఉండటంతో ఆయన జైలులో గడపాల్సివచ్చింది. ప్రస్తుతం ఆ కేసులోనూ బెయిల్ రావడంతో వంశీ విడుదలకు మార్గం సుగమమైంది.

వంశీ ఎప్పుడెప్పుడు విడుదలవుతారా? అంటూ వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఆయనను జైలులో ఉండగా, పార్టీ అధినేత జగన్ తోసహా వైసీపీలో ప్రధాన నేతలు అంతా పరామర్శించారు. 90 రోజుల జైలు జీవితంలో వంశీ చాలా నీరసించిపోయినట్లు కనిపిస్తున్నారు. తల నెరిసిపోవడంతోపాటు బక్కచిక్కినట్లు కనిపిస్తున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News