కేసీఆర్ విమర్శలపై రివర్స్ అటాక్.. కాంగ్రెస్ సర్కారుకు భలే అవకాశం!
కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేసిన వారు, పాలమూరుకు రూ.27 వేలు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.;
అసెంబ్లీ బహిష్కరించాలనే నిర్ణయంతో కేసీఆర్ తనకు తాను క్లీన్ బౌల్డ్ అయ్యారా? అనే చర్చ జరుగుతోంది. శనివారం అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత చూస్తే ఈ చర్చ నిజమని పిసిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డిపై ప్రభుత్వాన్ని ఎండగడతానని అసెంబ్లీకి ముందు ప్రకటించిన కేసీఆర్ తనకు తాను ఉచ్చు బిగించుకున్నట్లు అయిందని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ఆ తర్వాత తప్పుకోవడంతో ప్రభుత్వం ఓ రేంజ్ లో విజృంభించిందని చెబుతున్నారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడతానని ప్రకటించిన మాటలను ప్రదర్శించిన కాంగ్రెస్ విపక్ష నేతను ఆత్మరక్షణలోకి నెట్టేసిందని అంటున్నారు.
శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ ప్రభుత్వ విధానాలను వివరించడమే కాకుండా, గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్నారని తమను విమర్శించిన విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో 2015లో జీవో విడుదల చేశారని, 2022లో డీపీఆర్ సమర్పించారని మంత్రి ఉత్తమ్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేసిన వారు, పాలమూరుకు రూ.27 వేలు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారు. కేసీఆర్ మోటార్ ఆన్ చేసిన తెల్లారే మళ్లీ ఆఫ్ చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి పాలమూరును నిర్లక్ష్యం చేశారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా అంచనాలు పెంచుకుంటూ పోయారు. పాలమూరు నుంచి రోజుకు 1.5 టీఎంసీకి తగ్గించారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు తరలించే అవకాశం ఉండేది. 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునేవాళ్లం. వాటర్ సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ గత ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తయ్యేది. 414 మీటర్లలోతు నుంచి నీరు తీసుకునేవాళ్లం. శ్రీశైలానికి మార్చడం వల్ల పంపుల సంఖ్య 37కి పెరిగింది. దాదాపు 560 మీటర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయాల్సివచ్చిందని ఉత్తమ్ తెలిపారు.
ఇక కేసీఆర్ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో కలిసి ఏపీ ప్రయోజనాల కోసం పనిచేశారంటూ ఉత్తమ్ చేసిన కామెంట్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అక్రమంగా నీరు తరలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు చూస్తూ కూర్చొంది. ఏపీ ప్రభుత్వం రోజుకు 13 టీఎంసీలు తరలించుకుపోయేలా ప్రాజెక్టును విస్తరించింది. జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు ప్రాజెక్టు నిర్మిస్తుంటే బీఆర్ఎస్ కనీసం అభ్యంతరం చెప్పలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. పనులు నిలిపివేయించాం అంటూ ఉత్తమ్ వెల్లడించారు.
బీఆర్ఎస్ గైర్హాజరీలో మంత్రి ఉత్తమ్ విపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ఉద్దేశంతో కేసీఆర్ తన మీడియా సమావేశంలో కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారని, ఈ విమర్శల ద్వారా తానే ప్రభుత్వానికి అస్త్రాన్ని అందించారని అంటున్నారు. సరైన కారణం లేకుండా బీఆర్ఎస్ సభను బహిష్కరించడం వల్ల ప్రభుత్వ విమర్శలు, ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడం లేదా ఎదురుదాడి చేసే అవకాశాన్ని కోల్పోయిందని అంటున్నారు.