అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్‌లు: రద్దు అవుతున్న జాబ్ ఆఫర్ లెటర్లు!

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలనే భారతీయ విద్యార్థుల కలలు ఇప్పుడు అనిశ్చితి మేఘాలతో కమ్ముకుపోతున్నాయి.;

Update: 2025-10-22 04:35 GMT

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలనే భారతీయ విద్యార్థుల కలలు ఇప్పుడు అనిశ్చితి మేఘాలతో కమ్ముకుపోతున్నాయి. అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసిన తర్వాత కూడా... చేతికి అందినట్లే అనిపించిన జాబ్ ఆఫర్ లెటర్లు రద్దు అవుతుండడం తాజా పరిణామం. దీనికి ప్రధాన కారణం H-1B వీసాల చుట్టూ ఉన్న అస్థిరత.. తరచుగా మారుతున్న అమెరికా ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ పాలసీలు.

* మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ వంటి కంపెనీల నిర్ణయాలు

ఒక భారతీయ విద్యార్థి తన అనుభవాన్ని పంచుకుంటూ “నాకు మైక్రోసాఫ్ట్ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ ఇప్పుడు వారు దాన్ని రద్దు చేశారు. దీనికి కారణం H-1B వీసాలకు సంబంధించిన అనిశ్చితి. నా అమెరికా కల చిద్రమైంది” అని వాపోయారు. ఇటువంటి కథలు ఇప్పుడు అమెరికా క్యాంపస్‌లలో సర్వసాధారణంగా మారాయి.

*పెద్ద సంస్థలు కూడా ఈ అనిశ్చితికి తలొగ్గుతున్నాయి

వాల్‌మార్ట్ ఇన్‌క్. కూడా H-1B వీసా అవసరమయ్యే అభ్యర్థుల కోసం ఇచ్చిన ఆఫర్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం ట్రంప్ పరిపాలన H-1B వీసాలకు $100,000 భారీ ఫీజు విధించడమేనని సంస్థ ప్రకటించింది. “మేము ప్రతిభావంతులను నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నాం, కానీ ప్రస్తుతం పాలసీల మార్పు దృష్ట్యా మా ప్రణాళికలను పునఃపరిశీలిస్తున్నాం” అని వాల్‌మార్ట్ తెలిపింది.

*భారీ ఫీజులు, తరచుగా మారుతున్న నియమాలు

కొన్ని కంపెనీలు సిద్ధాంతంగా $100,000 ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏ క్షణాన ఏ నిబంధన మారుతుందో తెలియని అనిశ్చిత వాతావరణం కారణంగా వెనక్కి తగ్గుతున్నాయి. ఈ అనిశ్చితి ఉద్యోగదాతలలో భయాన్ని పెంచుతోంది.

ఉద్యోగదాతలు.. వీసా హోల్డర్లు ఈ పరిస్థితిపై తీవ్రంగా స్పందించారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ప్రభుత్వంపై కేసు వేయడం ఇమ్మిగ్రేషన్ పాలసీల గందరగోళాన్ని ప్రతిబింబిస్తోంది.

* విద్యార్థులకు చిన్న ఉపశమనం... కానీ నిలకడ లేదు

అమెరికా ప్రభుత్వం ఇటీవల ఒక ప్రకటనలో కొంత స్పష్టత ఇచ్చింది. F-1 విద్యార్థులుగా ఇప్పటికే అమెరికాలో ఉన్నవారు H-1B వీసాకు మారితే, వారికి ఈ $100,000 ఫీజు వర్తించదు. అయితే, అమెరికా వెలుపల నుండి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఈ వివరణ వచ్చినా, విద్యార్థులు, కంపెనీలు పెద్దగా ఊరట చెందడం లేదు. ఎందుకంటే ఈ వివరణ కూడా ఎప్పుడు మారుతుందో, కొత్త నిబంధనలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.

* విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం

ఈ అనిశ్చిత వాతావరణం కారణంగా అనేక సంస్థలు విదేశీ విద్యార్థులపై నమ్మకం తగ్గించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు H-1B వీసా హైరింగ్‌ను పూర్తిగా ఆపేశాయి. భారతీయ విద్యార్థులు కష్టపడి, ప్రతిభతో ఉద్యోగాలు సాధించినా రాజకీయ అనిశ్చితి, ఇమ్మిగ్రేషన్ పాలసీల గందరగోళం వారి కలలకు పెద్ద అడ్డంకిగా మారింది. అమెరికాలో స్థిరపడాలనే లక్ష్యం ఇప్పుడు విద్యార్థులకు మరింత కష్టతరంగా, అనిశ్చితంగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు తమ ప్రతిభతో పాటు, బయటి పరిస్థితులు.. ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News