బీ-2 బాంబర్లు వస్తాయి జాగ్రత్త... అమెరికా వార్నింగ్ స్టైల్ ఇదిగో!
ఈ నేపథ్యంలోనే బీ-2 బాంబర్ల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడిచింది. ఈ సమయంలో వాటినితోనే ఇప్పుడు యెమెన్ పై తనదైన శైలిలో బెదిరింపులకు దిగింది అమెరికా.;
ఇటీవల ముగిసిన ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలోకి ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చిన అమెరికా... టెహ్రన్ లోని మూడు కీలక అణు స్థావరాలపై బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీ-2 బాంబర్ల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడిచింది. ఈ సమయంలో వాటినితోనే ఇప్పుడు యెమెన్ పై తనదైన శైలిలో బెదిరింపులకు దిగింది అమెరికా.
అవును... సోమవారం నాడు హూతీ రెబల్స్ ఇజ్రాయెల్ పై క్షిపణిని ప్రయోగించాయి. ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ లోని అమెరికా రాయబారి మైక్ హుకేబి.. ఇజ్రాయెల్ పై హూతీలు క్షిపణులను ప్రయోగించారు.. వాటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకొనే సామర్థ్యం కలిగి ఉండడం అద్భుతం.. అని తెలిపారు.
ఈ సందర్భంగా... తాము షెల్టర్లకు వెళ్లి ఆల్ క్లియర్ అయ్యే వరకు ఎదురుచూడటమేనని చెప్పిన మైక్ హుకేబి... అమెరికా బీ-2 బాంబర్లు యెమెన్ ను సందర్శించాల్సిన అవసరం ఉందేమో అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం హూతీలు చేసిన తొలిదాడిపై అమెరికా ఇలా స్పందించింది.
యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ రెబల్స్.. ఇరాన్ కు సొంత తమ్ముళ్ల మాదిరి అని అంటారు. వీరికి అన్ని విధాలుగనూ ఇరాన్ సహాయ సహకారాలు ఉన్నాయని చెబుతారు. ఈ సమయంలో.. హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టుపై హూతీలు దాడి చేశారు. దీనికోసం వారు పాలస్తీనా-2 క్షిపణిని వినియోగించారు.
ఈ సందర్భంగా స్పందించిన హూతీ సంస్థ ప్రతినిధి... ఈ దాడుల విషయాన్ని ధృవీకరిస్తూ, తమ దాడి విజయవంతమైందని ప్రకటించారు. దీంతోపాటు అష్కలోన్, ఇలియాట్, జఫా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులు చేశామని తెలిపారు. మరోవైపు ఆ క్షిపణిని మార్గమధ్యలోనే అడ్డుకొన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
కాగా... ఇరాన్ పై అమెరికా దాడుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బీ-2 బాంబర్లపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సుమారు 18,144 కిలోల బరువైన బాంబులను మోసుకెళ్లగల ఈ బీ-2 బాంబర్లు... తాజాగా ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై ఇవి బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాయి.