అమెరికా విద్యా వీసాల జాప్యం: భారత ప్రభుత్వం ఒత్తిడి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు F1 విద్యా వీసాల జారీలో జరుగుతున్న జాప్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.;

Update: 2025-07-26 14:30 GMT

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు F1 విద్యా వీసాల జారీలో జరుగుతున్న జాప్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తుల స్క్రీనింగ్, సామాజిక మాధ్యమాల తనిఖీలను కఠినతరం చేయడంతో వీసా అపాయింట్‌మెంట్లు ఆలస్యం కావడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలను ధృవీకరించారు. వీసాల జాప్యంపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ కూడా లోతుగా చర్చలు జరిపిందని ఆయన తెలిపారు. విద్యార్థుల ఆందోళనలను అమెరికా అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

-విద్యార్థుల ఇబ్బందులు

వీసా అపాయింట్‌మెంట్లు పొందడమే కష్టంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు. దీనివల్ల అమెరికాలో చదువుల కోసం చేరాల్సిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వీసా ఆలస్యంతో కళాశాలల్లో తరగతులు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.

-అమెరికా వైఖరిపై విమర్శలు

జూన్ 18న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రకటనలో జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నవారిని తమ దేశంలోకి అనుమతించకుండా నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే, ఈ కఠిన చర్యలు నిరపరాధులైన విద్యార్థులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- భారతీయ-అమెరికన్ చట్టసభ్యుల సహకారం

ఈ సమస్య పరిష్కారానికి అమెరికాలోని 14 మంది భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు కూడా కృషి చేస్తున్నారు. డెబోరా రాస్ నేతృత్వంలోని ఈ బృందం, భారతీయ విద్యార్థులు ఏటా 900 కోట్ల డాలర్లకు పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించింది.

-ట్రంప్ పాలన ప్రభావం, సోషల్ మీడియా వెట్టింగ్

గత ఏడాది ట్రంప్ పరిపాలనలో కొత్త వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల వీసా జారీ ప్రక్రియలో భారీ అంతరాయం ఏర్పడింది. రెండు నెలల విరామం తర్వాతే వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలు , ఆన్‌లైన్ కార్యకలాపాలను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా దరఖాస్తుదారులపై సమగ్ర సమీక్ష చేయాలని అమెరికా కాన్సులేట్లు ప్రయత్నిస్తున్నాయి. దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని సూచనలు కూడా అందుతున్నాయి.

అక్రమ వలసలపై చర్యలు

మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ అక్రమ వలసల నియంత్రణకు అమెరికా ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. "ఈ-మైగ్రేట్" పోర్టల్, సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ అడ్వైజరీలు జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు వీసా ఆలస్యం వల్ల తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో వీసా ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చే దిశగా మార్పులను తీసుకురావాలనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News