ఇరాన్ లో ఖమేనీని ఎక్కడ దాచారో తెలుసా..?
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో శనివారం ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.;
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో శనివారం ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఈ సందర్భంగా మూడు అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు.
దీంతో.. ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి.. అమెరికా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని వ్యాఖ్యానించారు. మరోవైపు అటు ఇజ్రాయెల్ లోను, ఇటు అమెరికాలోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖమేనీ ఎక్కడ అనే చర్చ తెరపైకి వచ్చింది!
అవును... ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగిసినట్లు అని ఇజ్రాయెల్ ప్రధాని.. ఖమేనీ ఎక్కడున్నారో తెలిసినా ప్రస్తుతానికి ఆయనను చంపే ఉద్దేశ్యంలేదని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ భద్రత విషయంలో ఇరాన్ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఇరాన్ తో యుద్ధం మొదలై, నెతన్యాహు స్టేట్ మెంట్ అనంతరం ఖమేనీ బంకర్ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న పలువురు కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాన్ లోని అణుస్థావరాలపై అమెరికా సైతం దాడులు మొదలుపెట్టింది.
దీంతో... ఖమేనీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లను పూర్తిగా నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో భారీ పేళుల్లను సైతం తట్టుకునేలా ఆయనను అత్యంత సురక్షితమైన బంకర్ ఉంచినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో బయట జరుగుతున్న విషయాలను, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేసేందుకు, భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు.. ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు ఆయనకు అందుబాటులో ఉన్నారని అంటున్నారు.
మరోవైపు.. ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. తన వారసుడి కోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తనను ఐడీఎఫ్ దళాలు హతమారుస్తాయనే ఆందోళనలో ఉన్న ఖమేనీ.. తన వారసులుగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.