అమెరికా-ఇరాన్ డీల్ : భారత్‌లో ఫుల్ జోష్

మరో ప్రధానాంశం ఏమిటంటే, దేశానికి వచ్చే ముడిచమురు దిగుమతుల్లో సగానికి పైగా, అంటే సుమారు 50 శాతం పైగా చమురు ఓడలు 'హార్ముజ్' జలసంధి మీదుగానే ప్రయాణిస్తాయి.

Update: 2026-06-16 14:30 GMT

పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఫలించి, అమెరికా-ఇరాన్ మధ్య కీలకమైన శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా తన నావికాదళ దిగ్బంధనాన్ని తొలగించడానికి, ఇరాన్ 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి తెరవడానికి అంగీకరించాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకురావడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణ సానుకూల ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా, ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారతదేశానికి ఈ డీల్ ఒక పెద్ద ఊరటగా చెబుతున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల సగటు భారతీయుడికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు, ఉత్సాహం వస్తాయని విశ్లేషిస్తున్నారు.

శాంతి ఒప్పందం ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 82 డాలర్ల మార్కుకు తగ్గాయని చెబుతున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు 6,880 రూపాయలు పడిపోయాయన్న మాట. ఇది గత 3 నెలల కాలంలోనే అతి తక్కువ ధర కావడం గమనార్హం. గతంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా నిలిచిపోయి బ్యారెల్ ధర గరిష్టంగా 126 డాలర్లకు పెరిగింది. మన కరెన్సీలో దాదాపు 10,580 రూపాయలు పెరిగి ప్రతి ఒక్కరిపై భారం పెరిగేలా చేసిందని అంటున్నారు. ప్రస్తుతం బ్యారెల్‌కు దాదాపుగా 44 డాలర్లు అంటే సుమారు రూ.3,700 తగ్గింది. మన దేశం తన ముడిచమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇలా భారీగా తగ్గడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సగటు సామాన్యుడి రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, దేశంలో నిత్యావసరాల ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరో ప్రధానాంశం ఏమిటంటే, దేశానికి వచ్చే ముడిచమురు దిగుమతుల్లో సగానికి పైగా, అంటే సుమారు 50 శాతం పైగా చమురు ఓడలు 'హార్ముజ్' జలసంధి మీదుగానే ప్రయాణిస్తాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం, అనగా రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ ఈ జలసంధి గుండా వెళ్లే ఒక్కో ఓడపై దాదాపు 10 లక్షల డాలర్ల వరకు అంటే మన రూపాయిల్లో సుమారుగా ఏకంగా రూ. 8.4 కోట్లు టోల్ ఫీజు వసూలు చేసింది. అంతేకాకుండా యుద్ధ భయాల వల్ల షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా భారీగా పెరిగాయి. దీనివల్ల రవాణా ఖర్చులు తడిపి మోపడయ్యాయి. ఇప్పుడు ఈ జలసంధి పూర్తిగా ఓపెన్ అవ్వడంతో రవాణా భారం తగ్గి క్రూడాయిల్, గ్యాస్‌తో పాటు వ్యవసాయానికి అత్యంత కీలకమైన ఎరువుల దిగుమతి ఖర్చులు భారత్‌కు వందల కోట్ల రూపాయల్లో మిగలనున్నాయని అంటున్నారు.

ఇక మానవ వనరులు, ఎగుమతుల విషయానికి వస్తే.. గల్ఫ్ రీజియన్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కతార్, కువైట్ తదితర దేశాలలో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరు ఏటా పంపే విదేశీ నిధులు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలంగా చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ డీల్ వల్ల అక్కడ యుద్ధ వాతావరణం తొలగిపోయి, మన దేశీయుల ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు జరిగే బాస్మతి బియ్యం, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతాయని అంటున్నారు. ఇది దేశీయ ఎగుమతిదారులకు వేల కోట్ల రూపాయల వ్యాపార స్థిరత్వాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

ఇక ఇరాన్‌లో వ్యూహాత్మక చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం మన దేశం దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాలు, రష్యాకు రవాణా లింక్ ఏర్పాటు చేసుకోవడానికి భారత్‌కు ఇది అత్యంత కీలకంగా చెబుతున్నారు. అమెరికా విధించిన ఆంక్షలు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా చాబహార్ పోర్ట్ కార్యకలాపాలకు గతంలో బ్రేకులు పడ్డాయి. తాజా డీల్‌లో భాగంగా ఇరాన్‌పై ఆంక్షలు సడలించడం వల్ల చాబహార్ పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడులకు లాభాలు మొదలవ్వడమే కాకుండా, వ్యూహాత్మకంగా దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక ఈ డీల్ వల్ల రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలు తగ్గి, పారిశ్రామిక రంగానికి సామాన్య ప్రజానీకానికి మరింత మేలు జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News