భారతీయులతో అమెరికా ఎలా ప్రయోజనం పొందిందో మస్క్ మాటల్లో..!

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వలసలు, వీసాలు, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-01 07:11 GMT

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వలసలు, వీసాలు, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా హెచ్-1బీ విషయంలో ట్రంప్ నిర్ణయాలతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు! ఈ సమయంలో మస్క్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... పెరుగుతున్న అమెరికా వీసా ఆంక్షలు, పాలసీ అన్ ప్రెడిక్టబిలిటీ కారణంగా వేలాది మంది భారతీయుల అమెరికన్ కలలు కల్లలవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో.. టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ లో పాల్గొన్న సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకొని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందని మస్క్ అన్నారు. అయితే.. ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి కారణం గత ప్రభుత్వాల అలసత్వమే అని తెలిపారు.

బైడెన్ పాలనపై మస్క్ విమర్శలు!:

ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గతంలో బైడెన్ పాలనలో సరిహద్దుల్లో ఎలాంటి నియంత్రణ లేదని.. ఫలితంగా, అక్రమ వలసలు పెరిగిపోయాయని.. వలస వ్యతిరేక భావనలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించిందని ఎలాన్ మస్క్ అన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ప్రతిభావంతులకే పెద్ద పీట!:

ఇదే సమయంలో... తన కంపెనీలు అయిన టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ లు ప్రతిభావంతులను తీసుకోవడానికే చూస్తాయని.. వారికి సగటు కంటే ఎక్కువ జీతాలు ఇస్తుంటామని మస్క్ తెలిపారు. అయితే.. కొన్ని కంపెనీలు ఖర్చు తగ్గింపుపైనే దృష్టి పెడతాయని.. కాస్ట్ కటింగ్ పేరు చెప్పి ఒక అమెరికన్ ఉద్యోగికి చెల్లించాల్సిన జీతంల్తో పోలిస్తే ఇతర దేశాల ఉద్యోగులు తక్కువ జీతానికి దొరికితే వారినే ఆ కంపెనీలు నియమించుకుంటున్నాయని తెలిపారు.

హెచ్-1బీ ఆపేయాలని అనలేదు!:

ఈ సందర్భంగా కొన్ని ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ వీసాల వ్యవస్థను దెబ్బతీశాయని.. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసర ఉందని.. అయితే, హెచ్-1బీ వీసాలను ఆపేయాలని తాను పేర్కొనలేదని మస్క్ వివరించారు. తాను ఇప్పటికీ ఈ హెచ్-1బీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నానని.. దాన్ని పూర్తిగా మూసివేయడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పస్ఠం చేశారు.

Tags:    

Similar News