అమెరికా స్టూడెంట్ వీసాలకు చెక్.. ఇక కష్టమే
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కనే అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కనే అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉన్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీని ప్రకారం ఇకపై ఎఫ్-1 స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉండే కాలానికి గరిష్టంగా నాలుగేళ్ల పరిమితి విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం లభించగా అధికారిక అమలుకు సంబంధించిన తుది ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమిటి?
ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" అనే విధానం అమల్లో ఉంది. ఈ విధానం ప్రకారం విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు వీసా నిబంధనలు పాటిస్తున్నంత కాలం అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. ఒకవేళ కోర్సు వ్యవధి పెరిగినా ఒక యూనివర్సిటీ నుంచి మరో దానికి మారినా లేదా డిగ్రీ పూర్తి చేసి పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యలో చేరినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. చదువు పూర్తయిన తర్వాత లభించే ఓపీటీ , స్టెమ్ ఓపీటీ ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు కూడా ఈ విధానం ఎంతో దోహదపడుతుంది.
కొత్త విధానంతో మారనున్న సమీకరణాలు
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో అడుగుపెట్టే సమయంలోనే విద్యార్థికి గరిష్టంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఒకవేళ ఆ పరిమితి ముగిసేలోపు చదువు పూర్తికాకపోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. గడువు ముగిసేలోపు కోర్సు పూర్తికాని పక్షంలో విద్యార్థులు తప్పనిసరిగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించి గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పొడిగింపు ప్రక్రియ అంత సులభం కాకపోవచ్చు. దీనికోసం అదనపు పత్రాల సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, కఠినమైన డాక్యుమెంట్ పరిశీలన వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఇమ్మిగ్రేషన్ శాఖలో ప్రాసెసింగ్ ఆలస్యం జరిగితే, విద్యార్థుల చట్టబద్ధమైన హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
భారతీయ విద్యార్థులపై పడనున్న ప్రభావం
అమెరికాలో ప్రస్తుతం సుమారు 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం జనాభాలో భారతీయుల వాటా దాదాపు 30 శాతం వరకు ఉంది. అందువల్ల ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. పీహెచ్‌డీ , పరిశోధన ఆధారిత కోర్సులు, అలాగే కొన్ని రకాల దీర్ఘకాల మాస్టర్స్ ప్రోగ్రామ్స్ పూర్తి కావడానికి సాధారణంగా నాలుగేళ్లకు పైగా సమయం పడుతుంది. ఇలాంటి కోర్సులు చేసే విద్యార్థులకు ఈ నాలుగేళ్ల పరిమితి పెద్ద సవాలుగా మారనుంది. చదువు ముగిసిన తర్వాత లభించే ఓపీటీ ద్వారా ఉద్యోగంలో చేరే ప్రక్రియ కూడా ఈ కొత్త నిబంధనల వల్ల మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గడువు దాటితే కఠిన చర్యలు
కొత్త ప్రతిపాదనల ప్రకారం.. అనుమతించిన గడువు ముగిసిన వెంటనే విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో కొనసాగితే వారిని అక్రమ వలసదారులుగా పరిగణించే అవకాశం ఉంది. దీనివల్ల భారీ జరిమానాలు పడటమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ అమెరికా వీసా లభించకుండా నిషేధం విధించే ప్రమాదం కూడా ఉంది.
విద్యార్థులు ఆందోళన చెందాలా?
ఈ ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తన తొలి పదవీకాలంలోనే తీసుకువచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఇది అమలు కాలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ ఫైల్ ముందుకు కదిలింది. అయితే ప్రస్తుతానికి పాత "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానమే అమల్లో ఉంది. కొత్త నిబంధనలు అధికారిక గెజిట్ రూపంలో అమల్లోకి వచ్చే వరకు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత చట్టాల ప్రకారమే తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.