అమెరికా పౌరసత్వం రద్దు ప్రక్రియలపై కొత్త మార్గదర్శకాలు..

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రేఖా శర్మ-క్రాఫర్డ్ మాట్లాడుతూ "పౌరసత్వం రద్దు చేయాలంటే, ప్రభుత్వానికి బలమైన ఆధారాలు చూపించాల్సిందే.;

Update: 2025-07-09 06:25 GMT

అమెరికాలో సహజీకృత పౌరులపై న్యాయ విభాగం పట్టు బిగించింది. అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత కొన్ని నిర్దిష్ట నేరాలకు పాల్పడినవారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జూన్ 11న విడుదలైన ఈ మెమోలో అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెట్ ఏ. షుమేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ముఖ్యంగా వలసవాదుల వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఎవరు లక్ష్యంగా మారనున్నారు?

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, గ్యాంగ్ సభ్యత్వం, మానవ అక్రమ రవాణా, లైంగిక నేరాలు, ఇతర హింసాత్మక నేరాల్లో పాల్పడిన సహజీకృత పౌరసత్వం పొందిన అమెరికన్ పౌరులు లక్ష్యంగా మారనున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ పథకాలపై మోసాలకు పాల్పడినవారు, పౌరసత్వ దరఖాస్తు పేపర్ వర్క్‌లో అబద్ధాలు చెప్పినవారు, లేదా అపరాధ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు కూడా ఈ జాబితాలోకి వస్తారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఈ మెమోలో దాదాపు ఏ విషయానికైనా పౌరసత్వం రద్దు చేయొచ్చని సూచిస్తోంది," అని అలబామా రాష్ట్రానికి చెందిన మాజీ యూఎస్ అటార్నీ జాయ్స్ వాన్స్ వ్యాఖ్యానించారు. అంతేగాక ఈ మెమో ప్రజలలో ఒక రకమైన భయాన్ని సృష్టిస్తోందని, ముఖ్యంగా మాట్లాడిన మాటలకే విమర్శనీయులవుతారనే ఆందోళన పెరుగుతోందని ఆమె అన్నారు.

- న్యాయపరంగా రక్షణ ఉన్నా...

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రేఖా శర్మ-క్రాఫర్డ్ మాట్లాడుతూ "పౌరసత్వం రద్దు చేయాలంటే, ప్రభుత్వానికి బలమైన ఆధారాలు చూపించాల్సిందే. అదీ న్యాయస్థానంలో నిశ్చితమైన న్యాయ ప్రక్రియల కిందే జరగాలి," అని అభిప్రాయపడ్డారు. అయితే కేవలం ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకుంటే ఇది దుర్వినియోగానికి దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, పౌరుల హక్కులు కాలరాయబడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

- రాజకీయ ఆయుధంగా పౌరసత్వ రద్దు?

ఈ చర్యను కొంతమంది రాజకీయంగా కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్ మేయర్ పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా నిలబడ్డ జోహ్రాన్ మమ్దానీపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మమ్దానీ సహజీకృత పౌరుడని తెలిసినా, ఆయనను "కమ్యూనిస్ట్" అని లేబుల్ చేసి, "వినాశకారి వాగ్ధానాలు ఇస్తున్నాడని" విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రజలలో ముఖ్యంగా వలస నేపథ్యం ఉన్నవారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పౌరసత్వ రద్దు ప్రక్రియను రాజకీయ ప్రతీకార చర్యలకు ఉపయోగించుకోవచ్చని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

-చరిత్రలో అతి అరుదైన ప్రక్రియ

సాధారణంగా పౌరసత్వ రద్దు చాలా అరుదుగా జరుగుతుంది. 1990 నుంచి 2017 వరకు దాదాపు 300 కేసులే నమోదు అయ్యాయి అంటే సగటున ఏడాదికి 11 కేసులు మాత్రమే. అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో USCIS సుమారు 1,600 కేసులను న్యాయ విభాగానికి పరిశీలన కోసం పంపింది. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.

- స్వేచ్ఛకు బలవుతున్న పౌరసత్వం?

ఈ నూతన మార్గదర్శకాలు న్యాయపరంగా సమర్థవంతమైనవే అయినా దాని అమలు విధానంలో పారదర్శకత కొరవడితే రాజకీయ వాహకంగా మారే ప్రమాదం ఉంది. "చట్టపరంగా పౌరసత్వం రద్దు ఒక సాధ్యమైన అంశమే. కానీ అది భయాన్ని ప్రయోగించేందుకు ఉపయోగపడుతుందన్న అనుమానాన్ని ఈ మెమో కలిగిస్తోంది" అని రేఖా శర్మ-క్రాఫర్డ్ అభిప్రాయపడ్డారు.

అమెరికా స్వేచ్ఛ, సమానత్వ విలువల పట్ల ఉన్న గౌరవానికి ఈ నిర్ణయం ఎదురు దెబ్బలా మారిందని విమర్శకులు అంటున్నారు. నేరాలపై చర్యలు తీసుకోవడమే తప్పుకాదు. కానీ 'సహజీకృత' పౌరులను లక్ష్యంగా చేసుకుంటే, అది అమెరికా చరిత్రలో ఉన్న 'వివిధతలో ఐక్యత' అనే విలువను గాయపరచే అవకాశముంది. ఈ కొత్త మార్గదర్శకాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News