పాక్ ‘టీఆర్ఎఫ్’ పై అమెరికా ఉగ్ర ముద్ర... ఆసక్తికరంగా చైనా రియాక్షన్!

పహల్గాం దాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆ మారణహోమానికి పాల్పడిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (టీఆర్‌ఎఫ్‌)ను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.;

Update: 2025-07-19 06:40 GMT

పహల్గాం దాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆ మారణహోమానికి పాల్పడిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (టీఆర్‌ఎఫ్‌)ను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబా ముసుగు సంస్థగా టీఆర్‌ఎఫ్‌ ను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ సమయంలో చైనా స్పందించింది.

అవును... 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ సందర్భంగా అమెరికా చర్యను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ప్రశంసించారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని.. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

ఇదే సమయంలో... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని పెంపొందించుకోవాలని.. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని.. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు.

మరోవైపు టీఆర్ఎఫ్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఉగ్రవాదంపై పోరులో ఢిల్లీ, వాషింగ్టన్‌ మధ్య బలమైన సహకారానికి ఇది మరో నిదర్శనమని, ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించకూడదని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదే విషయంపై పాక్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పహల్గాం దాడికి, లష్కరే తయిబాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సదరు ఉగ్రసంస్థ నెట్‌ వర్క్‌ ను తాము ఇప్పటికే ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ చర్యతో పాక్‌ ను ప్రపంచం ముందు అవమానపరచడమేనని పేర్కొంది.

కాగా... పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారిగా టీఆర్‌ఎఫ్‌ అధిపతి షేక్‌ సజ్జద్‌ గుల్‌ ను ఎన్‌ఐఏ గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీఆర్‌ఎఫ్‌ 2019లో ఆవిర్భవించింది. ఇది తొలుత ఆన్‌ లైన్‌ సంస్థగా ప్రారంభమై.. ఆరు నెలలు గడిచేసరికి లష్కరే తయిబా సహా పలు సంస్థల ఉగ్రవాదులను చేర్చుకొని భౌతిక ముఠాగా రూపుదిద్దుకుంది.

Tags:    

Similar News