పాకిస్తాన్ లో అమెరికాకు పెనుముప్పు.. కాన్సులేట్ ఎత్తివేత
పాకిస్తాన్‌లో పెరుగుతున్న భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;
పాకిస్తాన్‌లో పెరుగుతున్న భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ రాజధాని పేషావర్‌లో ఉన్న తమ కాన్సులేట్‌ను మూసివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో “అమెరికా దౌత్య సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే సమయంలో వనరుల సమర్థ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం” అని పేర్కొంది.
ఇకపై ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతానికి సంబంధించిన అన్ని దౌత్య కార్యకలాపాలను ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పర్యవేక్షించనుంది. పేషావర్ ప్రాంతం గత కొన్నేళ్లుగా తీవ్రవాద దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణలకు కేంద్రంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం , ఇస్లామాబాద్ ప్రభుత్వం “ఆఫ్ఘన్ మద్దతుతో పనిచేస్తున్న మిలిటెంట్లు”గా పేర్కొంటున్న ఉగ్రవాద గుంపుల మధ్య తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య పరిణామాలు దక్షిణాసియాపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద భారీ నిరసనలు జరిగాయి. ఆ సమయంలో ఆందోళనకారులు కాన్సులేట్ వెలుపలి గోడను ధ్వంసం చేసి లోనికి చొరబడేందుకు ప్రయత్నించగా జరిగిన హింసలో పది మంది మరణించారు. ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థను తీవ్రంగా కలవరపరిచినట్లు తెలుస్తోంది.
పేషావర్ కాన్సులేట్ మూసివేతతో అమెరికా-పాకిస్తాన్ సంబంధాలపై కూడా చర్చ మొదలైంది. భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నప్పటికీ దీని ద్వారా పాకిస్తాన్‌లోని అస్థిర పరిస్థితులపై ప్రపంచానికి ఒక సంకేతం వెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయ దౌత్య సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు భావిస్తున్నారు.