జగన్ నీకు దండం పెడతా...వైఎస్సార్ బెస్ట్ ఫ్రెండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎదురైందో లేదో తెలియదు.;

Update: 2025-11-04 12:13 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎదురైందో లేదో తెలియదు. కానీ ఇపుడు మాత్రం ఒక చిత్రమైన పరిస్థితిగానే చూడాలి. వైఎస్సార్ కి బెస్ట్ ఫ్రెండ్ గా పేరు పొందిన వారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన వైఎస్సార్ కి ఎంతటి సన్నిహితులో అందరికీ తెలిసిందే. రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మరీ గెలిపించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తన కోటరీలో కీలకమైన నేతగానూ భావించేవారు. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఫ్రెండ్ కొడుకు అయిన వైఎస్ జగన్ పట్ల అదే రకమైన అభిమానం ఉంటుంది. తనకు అలా ఉంది అని చాలా సార్లు ఉండవల్లి మీడియా ముఖంగానూ చెప్పుకున్నారు. మరి ఉండవల్లి చెబితే జగన్ వింటారా లేదా అన్నది పక్కన పెడితే ఏకంగా ఒక దండం పెట్టి మరీ జగన్ కి రిక్వెస్ట్ చేసారు ఉండవల్లి. అది ఆయన సొంత వ్యవహారం కాదు, ప్రజల కోసం, వైసీపీ కోసం కూడా. ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏమిటి అంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని.

అసెంబ్లీకి వెళ్ళాల్సిందే :

జగన్ ఆయనతో పాటు పదిమంది ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ సెషన్ కి అయినా సభకు హాజరు కావాలని ఉండవల్లి గట్టిగా కోరుకుంటున్నారు. తాజాగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయం చెప్పారు. అసెంబ్లీకి వెళ్ళకుండా దూరం పాటించడం మంచిది కాదని అన్నారు. ఇక అధికార పక్షం అతి పెద్ద మెజారిటీతో ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండాలంటే ప్రతిపక్షం అవసరమని, ప్రజల పక్షంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించడం వైసీపీ చేయాల్సిన పని అన్నారు. మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని అసెంబ్లీలో మట్లాడితేనే విలువ ఉంటుందని హితవు పలికారు.

హోదా మ్యాటరే కాదు :

ప్రతిపక్ష హోదా అన్నది మ్యాటరే కాదని ఉండవల్లి కొట్టి పారేశారు. దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం అన్నారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడితే అక్కడ ప్రతీదీ రికార్డు అవుతుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. సభలో మాట్లాడేందుకు సమయం కోరడం అన్నది సభ్యుల బాధ్యత అని స్పీకర్ కనుక సమయం ఇవ్వకపోతే అపుడు ప్రజలకు కూడా విషయం తెలుస్తుంది కదా అని ఆయన అంటున్నారు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తాలనే వైసీపీ తరఫున ఎమ్మెల్యేలను గెలిపించారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల జగన్ అసెంబ్లీకి వెళ్ళడం కంటే ఉత్తమం మరొకటి లేదని అన్నారు.

వైసీపీ ఆలోచనేంటి :

అయితే ఇప్పటికి ఏణ్ణర్ధం కాలం గడచిపోయింది. అసెంబ్లీకి మాత్రం వైసీపీ వెళ్ళడం లేదు. జగన్ ఈ విషయంలో ఒక స్పష్టతతో ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. నిబంధలన ప్రకారం అది కుదిరే వ్యవహారం కాదని కూటమి ప్రభుత్వం అంటోంది పీట ముడి అలా అక్కడ పడిపోయింది. అయినా సరే ప్రజా సమస్యల ప్రస్తావన కోసం ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళడం అన్నది మంచిదని అంటున్నారు. ఉండవల్లి లాంటి వారు కూడా అదే హిత బోధ చేస్తున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం దీనిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ విషయంలో దండం పెట్టి చెబుతున్నాను అసెంబ్లీకి వెళ్ళమని అంటూ ఉండవల్లి అంటున్నారు అంటే వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ విధానం మంచిది కాదని ఆయన గట్టిగానే చెబుతున్నారు అనుకోవాలి.

Tags:    

Similar News