గ్లోబల్ ఇష్యూగా మారిన లోకల్ ఇష్యూ.. మస్క్ కామెంట్ వైరల్!

బ్రిటన్‌లో జరిగిన ఒక స్థానిక క్రైమ్ కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-06-06 19:30 GMT

బ్రిటన్‌లో జరిగిన ఒక స్థానిక క్రైమ్ కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం కాస్తా అంతర్జాతీయ చర్చకు దారితీసింది. బ్రిటన్ పోలీసుల తీరుపై మస్క్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు బ్రిటన్‌లో ఏం జరిగింది? ఒక సాధారణ కేసు గ్లోబల్ ఇష్యూగా ఎలా మారింది? అమెరికా, బ్రిటన్ మధ్య దౌత్య యుద్ధానికి కారణమైన ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసలు కేసు చూస్తే :

గత ఏడాది డిసెంబర్‌లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో ఒక ఘోర కలికాలం చోటుచేసుకుంది. 18 ఏళ్ల విద్యార్థి హెన్రీ నోవాక్‌పై విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇక తీవ్ర గాయాలతో హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతూ నేలపై కుప్పకూలిపోయాడు. అయితే, అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని రక్షించడం కంటే, అతనికి బేడీలు వేసి నేరస్థుడిలా చూడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

'టూ-టియర్' పోలీసింగ్ ఆరోపణలు:

బ్రిటన్ పోలీసులు స్థానిక తెల్లజాతీయుల పట్ల ఒకలా, వలస వచ్చిన మైనారిటీల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఈ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనినే 'టూ-టియర్ పోలీసింగ్' అని పిలుస్తున్నారు. ఈ కేసులో బాధితుడైన హెన్రీ తెల్లజాతీయుడు కావడం, దాడి చేసిన వ్యక్తి మైనారిటీ కమ్యూనిటీకి చెందినవాడు కావడంతో పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారనే చర్చ అంతర్జాతీయంగా ఊపందుకుంది.

ఎలాన్ మస్క్ ఎంట్రీతో మారిన సీన్:

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కంటే ముందే ఈ విషయంపై టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. తన ఎక్స్ వేదికగా బ్రిటన్ పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ ఈ కేసుపై ట్వీట్ చేయడంతో, ఇది కాస్తా ఒక్క రాత్రిలోనే గ్లోబల్ ఇష్యూగా మారిపోయింది.

లీకైన వీడియో.. ప్రజల్లో ఆగ్రహం:

తీవ్రంగా గాయపడిన హెన్రీకి పోలీసులు బేడీలు వేస్తున్న 'బాడీ క్యామ్ వీడియో' సోషల్ మీడియాలో లీక్ కావడంతో బ్రిటన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇక రక్తం ఓడుతున్న బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించడం మానేసి, పోలీసులు అతనిని ఒక నేరస్థుడిగా చూడటాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

యూరప్‌లో వలసల విధానంపై ఒత్తిడి:

ఈ ఘటనను అమెరికా అధికార యంత్రాంగం యూరప్‌లోని 'వలస విధానాల వైఫల్యం' తో ముడిపెట్టింది. ఇక సరిహద్దులు దాటి వస్తున్న వలసదారుల వల్ల స్థానికులకు రక్షణ కరువవుతోందనే వాదనకు ఈ కేసు ఇప్పుడు ఒక ప్రధాన అస్త్రంగా మారింది. దీనివల్ల యూరప్‌లో వలసల నియంత్రణపై ఒత్తిడి మరింత పెరిగింది.

రాజకీయాలకు వ్యతిరేకంగా బాధితుడి కుటుంబం:

ఈ మొత్తం వ్యవహారంలో ఒక ట్విస్ట్ ఏంటంటే, స్వయంగా బాధితుడైన హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులే అమెరికా రాజకీయ నాయకుల వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తమ కొడుకు చావును అమెరికాలో ఓట్ల కోసం లేదా బ్రిటన్‌లో జాతి వివక్షను రెచ్చగొట్టడం కోసం వాడుకోవద్దని, తమను ప్రశాంతంగా ఉండనివ్వాలని వారు వేడుకుంటున్నారు.

ఒక చిన్న ప్రాంతంలో జరిగిన నేరం, సోషల్ మీడియా పవర్ మరియు ప్రముఖుల కామెంట్స్ వల్ల ప్రపంచ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరింది. అయితే ఈ గ్లోబల్ పాలిటిక్స్ మధ్య అసలు న్యాయం జరగాలనేది, బాధితుడి కుటుంబానికి ఊరట లభించాలనేదే అందరి కోరిక. మరి బ్రిటన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News