ఇక ఆకాశమే హద్దు.. హెలిక్టాపర్ సర్వీసుల్లోకి 'ఉబర్'
ప్రస్తుతానికి ఈ సేవలు ఎయిర్‌పోర్ట్ కనెక్షన్లకే పరిమితం కానున్నాయి. విమానాశ్రయాలకు అనుసంధానం చేసే మార్గాలు ప్రజలకు అత్యంత విలువైనవిగా గుర్తించబడ్డాయి.;
ప్రపంచవ్యాప్తంగా రైడ్‌హైలింగ్ సేవలతో గుర్తింపు పొందిన ఉబర్ (Uber) ఇప్పుడు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించి ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను తయారుచేసే కాలిఫోర్నియాకు చెందిన జోబీ ఏవియేషన్ తో ఉబర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో వచ్చే ఏడాది నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జోబీ ఏవియేషన్ ఇటీవల 125 మిలియన్ డాలర్లకు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ ని కొనుగోలు చేసింది. ఇప్పటికే బ్లేడ్ తన సర్వీసుల ద్వారా హెలికాప్టర్లు, సముద్ర విమానాలను వినియోగించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. 2024లో న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతం, దక్షిణ యూరప్‌లోని అనేక రూట్లలో బ్లేడ్ 50,000 మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందించింది. ముఖ్యంగా న్యూఆర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జాన్ ఎఫ్. కెనడీ ఎయిర్‌పోర్ట్, మన్‌హాటన్, హ్యాంప్టన్స్ వంటి రద్దీ ప్రదేశాలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
జోబీ వ్యవస్థాపకుడు, సీఈఓ జోబెన్ బీవర్ట్ మాట్లాడుతూ, ఉబర్ వినియోగదారులు సులభమైన అర్బన్ ఎయిర్ ట్రావెల్ అనుభూతిని పొందడానికి తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. త్వరలోనే బ్లేడ్, ఉబర్ సేవలు కలిసిపోతాయి. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న నగరాల్లోని ప్రజలు నేరుగా ఉబర్ యాప్ ద్వారా హెలికాప్టర్ బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ సేవలు ఎయిర్‌పోర్ట్ కనెక్షన్లకే పరిమితం కానున్నాయి. విమానాశ్రయాలకు అనుసంధానం చేసే మార్గాలు ప్రజలకు అత్యంత విలువైనవిగా గుర్తించబడ్డాయి. ఈ హెలికాప్టర్ సర్వీసుల ద్వారా శాంతమైన, జీరో ఎమిషన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగానికి దారి తీస్తుందని బీవర్ట్ స్పష్టం చేశారు.
ఇకపై ట్రాఫిక్ జామ్‌లను పక్కన పెట్టి, నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం ఉబర్ కలల ప్రాజెక్ట్‌గా మారనుంది.