డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుకు బ్రేక్.. విజయ్ కోర్టులో బంతి.. అధికారానికి దారేది?
దశాబ్దాల కాలంగా ద్రవిడ రాజకీయాలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడులో ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది.;
దశాబ్దాల కాలంగా ద్రవిడ రాజకీయాలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడులో ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించారు. ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాల్లో ఘనవిజయం సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయితే ఈ గెలుపు ఉత్సాహం మధ్యనే అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో 'మ్యాజిక్ ఫిగర్' సంక్లిష్టత ఇప్పుడు తమిళనాడును ఉత్కంఠలో ముంచెత్తుతోంది.
రాజ్యాంగ సంక్షోభం వద్దు.. ఎం.కె. స్టాలిన్ సాఫ్ట్ స్టాండ్
అధికార పీఠాన్ని కోల్పోయినప్పటికీ డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. "విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు.. మేము ఎలాంటి రాజ్యాంగ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. ఆరు నెలల పాటు వారి పాలనను నిశితంగా గమనిస్తాం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఇది కేవలం ప్రజాస్వామ్య పరిపక్వత మాత్రమే కాదని.. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. యువతలో విజయ్‌కున్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, తక్షణమే అడ్డుతగిలి ప్రజల ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతోనే స్టాలిన్ ఈ 'వెయిట్ అండ్ వాచ్' పాలసీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ దోబూచులాట.. గవర్నర్ కఠిన నిర్ణయం
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పెట్టిన నిబంధన ఆయనకు సవాలుగా మారింది. సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటే కనీసం 118 మంది సభ్యుల మద్దతు ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు. విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ రాజ్యాంగపరంగా ఒక ఓటు మాత్రమే పరిగణనలోకి రావడంతో టీవీకే బలం 107కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తనకున్న 5 స్థానాలతో మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరడానికి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడటంతో తమిళ రాజకీయాల్లో సందిగ్ధత నెలకొంది.
అసంబద్ధ పొత్తుల ప్రచారం.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఖండన
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా చేసుకుని డీఎంకే (59 సీట్లు), అన్నాడీఎంకే (47 సీట్లు) కలవబోతున్నాయన్న ఊహాగానాలు చెన్నై వీధుల్లో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించింది. డీఎంకే తమ బద్ధశత్రువని, వారితో జతకట్టే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే అధినేత ఫళనిస్వామి తేల్చిచెప్పింది. ఈ వదంతుల సృష్టికర్త విజయ్ పార్టీయేనని, సానుభూతి కోసం ఇలాంటి 'సినిమా స్క్రిప్టులు' రాస్తున్నారని అన్నాడీఎంకే నేతలు ఎద్దేవా చేశారు. మరోవైపు డీఎంకే ప్రతినిధి ఏ. శరవణన్ సైతం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు.
ఏం జరగబోతోంది?
ప్రస్తుతానికి గవర్నర్ 16వ శాసనసభను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలమైతే రాష్ట్రం మరోసారి ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. యువ ఓటర్లు ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్‌ను చూస్తున్న తరుణంలో సంప్రదాయ ద్రవిడ పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్టాలిన్ ఇచ్చిన 'ఆరు నెలల గడువు' విజయ్ పాలనా దక్షతకు పరీక్షా? లేక ముందస్తు వ్యూహమా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా తమిళ తంబీల తీర్పుతో దక్షిణాది రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.