అర్వింద్ రాజకీయాల్లో కీలక మలుపు... ఏం జరిగింది?
ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు. బీజేపీ నాయకుడు. తరచుగా మీడియా ముందు కు వచ్చి తన కామెంట్లతో రాజకీయంగా వేడి పుట్టించే నాయకుడు కూడా.;
ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు. బీజేపీ నాయకుడు. తరచుగా మీడియా ముందు కు వచ్చి తన కామెంట్లతో రాజకీయంగా వేడి పుట్టించే నాయకుడు కూడా. తాజాగా ఆయన నియోజకవర్గం లో సంబరాలు జరుగుతున్నాయి. అర్వింద్ రాజకీయాల్లో కీలక ఘట్టంగా పేర్కొంటున్న.. 'పసుపు బోర్డు' ఏర్పడింది. నియోజకవర్గంలోనే దీనిని ఏర్పాటు చేశారు. ఇది కొన్ని దశాబ్దాల కల కావడం తెలిసిందే. 2014, 2018, 2023 ఎన్నికల్లో కూడా.. పసుపు రైతులు ఈ బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమించారు.
ముఖ్యంగా మూడు జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పసుపు పంటను ఎక్కు వగా పండిస్తున్నారు. అయితే.. దీనిని విక్రయించుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఉంది. అయితే.. ఎప్పటికప్పుడు దీనిపై హామీలు ఇస్తున్నా.. అవి సాకారం కావడం లేదు. ఈ క్రమంలోనే రైతులు 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామంటూ.. ఎన్నికల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
మరోవైపు.. ఇక్కడి రైతులు పసుపు బోర్డు కోరుకుంటుంటే... కేంద్రం స్పైసెస్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇది మరింతా ఇక్కడి రైతులకు మంటపుట్టించింది. ఈ పరిణామాల క్రమంలోనే ధర్మపురి అర్వింద్ తాను గెలిస్తే.. ఖచ్చితంగా పసుపు బోర్డును ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. దీనిపై కేంద్రంతో ఆయన అనేక సార్లు చర్చించారు. చివరకు పసుపు బోర్డు ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఒప్పించారు. దీనిని ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
ఏంటి ప్రయోజనం?
పసుపు రైతులు... తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. రవాణా చార్జీలు తగ్గుతాయి. అదేవిధంగా రైతులకు.. గిట్టుబాట ధర కూడా లభిస్తుంది. మరోవైపు.. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో ఎంపీగా అర్వింద్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగింది. రైతుల్లో ఆయనకుసానుకూలత మరింత పెరిగింది. ఎలా చూసుకున్నా.. మొత్తంగా.. ఇప్పుడు పసుపు బోర్డు రాకతో అర్వింద్ రాజకీయాలు.. కీలక మలుపు తిరిగాయని అంటున్నారు పరిశీలకులు.