విమానం ఆగకముందే బెల్ట్ తీస్తే బ్యాండ్ బాజా.. ఈ కొత్త రూల్ తెలుసా?

విమానంలో భద్రత, క్రమశిక్షను పెంచే చర్యల్లో భాగంగా టర్కీష్ విమానయాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-05-31 20:30 GMT

ప్రయాణిస్తున్న వాహనం ఆగేవరకూ చాలామందికి ఆత్రం ఆగదు! అది స్టాప్ లో ఎంతసమయం కావాలంటే అంత సమయం ఆగే ఆర్టీసీ బస్సు అయినా.. స్టేషన్ లో నిలిచే ట్రైన్ అయినా.. ఎయిర్ బస్ అయినా... గమ్యస్థానానికి చేరడానికి కొన్ని నిమిషాల ముందే లేచి నిలబడి, పైన క్యాబిన్ లో పెట్టిన లగేజ్ తీసుకుంటూ హడావిడి చేస్తుంటారు కొంతమంది ప్రయాణికులు!

రైళ్లలో ప్రయాణించేవారు కొంతమంది అయితే... స్టాప్ కి ముందే సీటు కింద ఉంచిన లగేజ్ మొత్తం తెచ్చుకుని డోరుకు అడ్డంగా పెట్టి కాసుకుని కూర్చుంటారు! మిగిలిన ప్రయాణికులతో వారికి ఏమాత్రం సంబంధం ఉండదన్నట్లుగానే ప్రవర్తిస్తారు! ఇలాంటివారు విమానాల్లోనూ దర్శనమిస్తుంటారు! ఈ క్రమంలో ఇలాంటివారి కోసం టర్కీ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది.

అవును... విమానంలో భద్రత, క్రమశిక్షను పెంచే చర్యల్లో భాగంగా టర్కీష్ విమానయాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... విమానం పూర్తిగా ఆగకముందే సీటు బెల్ట్ లను తీసే, లేచి నిలబడే ప్రయాణికులకు జరిమానాలు విధించాలని విమానయాన అధికారులు నిర్ణయించారు. దీంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన టర్కిష్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కెమాల్ యుక్సెక్... విమానం పూర్తిగా అగకముందే సీటు బెట్లు తీసేయడం, లేచి నిలబడి ఓవర్ హెడ్ బిన్లను తెరవడం వంటి ఉల్లంఘనలకు 2,603 టర్కిష్ లీరా (సుమారు 6000 రూపాయలు) వరకూ జరిమానాలు విధించవచ్చని తెలిపారు!

ఇదే సమయంలో... దయచేసి మీ ముందు లేదా చుట్టుపక్కల ఉన్న ప్రయాణికుల దిగే ప్రాధాన్యతను గౌరవించాలని.. ఈ క్రమంలో మీ వంతు వచ్చే వరకూ వేచి ఉండాలని అధికరిక నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో అలాంటి ఉల్లంఘనలను నేరుగా అధికారులకు క్యాబిన్ సిబ్బంది నివేదించాలని తెలిపారు!

కాగా... ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ విధానానికి టర్కీ మద్దతు ఇచ్చిన అనంతరం.. "టర్కీని బహిష్కరించండి" అనే పిలుపు ఇండియన్స్ లో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇది టర్కీ పర్యాటక పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ వేరే పనుల రీత్యా వెళ్లాల్సిన వారు ఈ నిబంధనలను గుర్తుంచుకోవాలి!

వాస్తవానికి టర్కీకి వెళ్లే భారతీయ ప్రయాణికుల సంఖ్య ఒక ఏడాదిలోనే రెట్టింపు అయ్యింది. ఇందులో భాగంగా... 2023లో వీరి సంఖ్య 1.17 లక్షలు కాగా.. 2024లో వీరి సంఖ్య 2.43 లక్షలు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 80,000 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News