తురకపాలెంలో మళ్లీ కలకలం.. మరో మహిళ బలి
తురకపాలెంలో గత నాలుగు నెలలుగా సుమారు 40 మంది మృత్యువాత పడినట్లు కథనాలు వస్తున్నాయి.;
గుంటూరు నగరానికి ఆనుకుని ఉన్న తురకపాలెంలో మళ్లీ మరణాలు సంభవిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు తీవ్ర కలకలం రేపిన అంతుచిక్కని వ్యాధి ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణతో కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో మరణాలు ఆగిపోయాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ మరణించడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తీవ్ర జ్వరంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో తురకపాలెం మరణాల సంఖ్య మరింత పెరిగింది.
తురకపాలెంలో గత నాలుగు నెలలుగా సుమారు 40 మంది మృత్యువాత పడినట్లు కథనాలు వస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో గ్రామస్తులు వరుసగా మరణిస్తుండగా, ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను పంపి మరణాల వెనుక మిస్టరీని తేల్చాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందజేశారు.
ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించిన వైద్యులు సుమారు 40 రకాల పరీక్షలు చేసి‘మెలియోడోసిస్’ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో దాదాపు మూడు వేల మంది ఉండగా, 4 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. అంతేకాకుండా ఒకరు ‘మెలియోడోసిస్’ లక్షణాలతో మరణించారని గుర్తించారు. ఇదేసమయంలో గ్రామంలో సేకరించిన నీటి నమూనాల్లో యూరేనియం గుర్తించారు. దీంతో తురకపాలెం మరణాలకు కారణం ఏంటన్న దానిపై స్పష్టత కొరవడింది. గ్రామస్థుల అనారోగ్యానికి ‘మెలియోడోసిస్’ కారణమా? లేక యురేనియం ఆనవాళ్లా? అనే తర్జనభర్జన కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో మరో మరణం సంభవించడంతో గ్రామస్థులు హడలిపోతున్నారు. గ్రామంలో యుక్త వయసు వారే ఎక్కువగా మరణించడం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది. గ్రామంలో నాలుగు నెలల్లో 40 మంది వరకు మరణించారు. జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మరణాలు సంభవించగా, సెప్టెంబరులో ప్రభుత్వ చర్యలతో మరణాలు తగ్గాయి. మళ్లీ అక్టోబరు మొదటి వారంలో మరణ మృదంగం మోగడంతో ప్రజలు ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.