ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ గర్జన.. చమురు దేశంలో ‘అంతర్యుద్ధం’.. ఇంటర్నెట్ బంద్
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.;
తా వలిచింది రంభ.. తాను దాడి చేసింది నా దేశం అంటూ సామ్రాజ్యవాదంతో రెచ్చిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెనిజువెలను కబళించేశాడు. ఇప్పుడు ఆయన కన్ను మరో అపార చమురు నిల్వలు ఉన్న ‘ఇరాన్’ పై పడింది. వెనిజువెల చమరుపై హక్కు సాధించిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ లోనూ అల్లర్లు ఎగదోసి ఆ దేశంపై దాడికి దిగబోతున్నాడని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. దీంతో అంతర్జాతీయ రాజకీయ యవనికపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై హింసకు పాల్పడి ప్రాణనష్టం కలిగిస్తే అమెరికా ఊరుకోదని గట్టి చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “ఒకవేళ మీరు ప్రజలను చంపడం మొదలుపెడితే మేము మీపై బలమైన ప్రతిచర్య చూపిస్తాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. తొక్కిసలాట వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. కానీ కావాలనే హింసకు పాల్పడితే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే” అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఇరాన్
ఇరాన్ దేశం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరెన్సీ విలువ భారీగా పతనమవ్వడం.. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
పూర్తిగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
ఇరాన్ వీధుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిరసనకారులు వాహనాలకు నిప్పు పెడుతున్న దృశ్యాలు, పోలీసుల కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం బలప్రయోగంతో నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తుండటంతో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం భయపడుతోంది. నిరసనల తీవ్రతను నియంత్రించేందుకు ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆంక్షలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు దాదాపు పూర్తిగా నిలిచిపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. సోషల్ మీడియా ద్వారా సమాచార మార్పిడిని అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
హింసాత్మక ఘటనలు, వైరల్ వీడియోలు
నిరసనల సమయంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితి రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ వ్యూహం ఏంటి?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా కేవలం ప్రజాస్వామ్యం కోసం ఈ హెచ్చరికలు చేయడం లేదు. ఇరాన్ వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అక్కడ అస్థిరతను సృష్టించి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. వెనిజువెలా తరహాలోనే ఇరాన్‌ను కూడా ఆర్థికంగా రాజకీయంగా లొంగదీసుకోవడమే ట్రంప్ అసలు లక్ష్యమని తెలుస్తోంది.
ఇరాన్‌లో పరిస్థితులు ఎటు దారితీస్తాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనగా ట్రంప్ వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత అంతర్జాతీయ ప్రాధాన్యత తీసుకొచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకెళ్తుందా? లేక అమెరికా సైనిక చర్యకు దిగుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇరాన్‌లో ఇంటర్నెట్ బంద్ కావడం, ట్రంప్ యుద్ధ గర్జన చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి.