ట్రంప్ టారిఫ్ షాక్‌: భారత్ దిగుమతులు నిలిపిన అమెజాన్, వాల్‌మార్ట్‌

వెల్‌స్పన్‌ లివింగ్‌, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండోకౌంట్‌, ట్రైడెంట్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తుల్లో 40-70 శాతం వరకు అమెరికాకే ఎగుమతులు చేస్తుంటాయి.;

Update: 2025-08-08 13:24 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు ప్రస్తుతం భారత ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అమెరికాలో వ్యాపార వర్గాలు, రిటైల్ దిగ్గజాలు ఈ పరిణామాలతో అప్రమత్తమవుతూ భారత్‌ నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టెక్స్‌టైల్‌, దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది.

-గందరగోళంలో ఎగుమతిదార్లు, దిగుమతి సంస్థలు

సుంకాల భారాన్ని ఎవరు భరించాలి అనే ప్రశ్నతో ఎగుమతిదార్లు, దిగుమతి సంస్థలు అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. కొనుగోలుదారులు అధిక ధరలను భరించేందుకు సిద్దంగా లేకపోవడంతో అమెరికా రిటైల్ సంస్థలు వాల్‌మార్ట్‌, అమెజాన్‌, గ్యాప్‌, టార్గెట్‌ భారత టోకు వ్యాపారులకు మెయిల్స్‌ పంపి స్టాక్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచిస్తున్నాయి.

- ధరలు 35% వరకు పెరిగే అవకాశం

ట్రంప్‌ విధించిన తాజా టారిఫ్‌లతో అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు సగటున 30 నుంచి 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో కొనుగోళ్లు తగ్గి, భారత టెక్స్‌టైల్‌ ఎగుమతులు 40-50 శాతం మేర తగ్గే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల దాదాపు 4-5 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశముంది.

- అమెరికాపై ఆధారపడిన ఎగుమతిదారుల ఆందోళన

వెల్‌స్పన్‌ లివింగ్‌, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండోకౌంట్‌, ట్రైడెంట్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తుల్లో 40-70 శాతం వరకు అమెరికాకే ఎగుమతులు చేస్తుంటాయి. ఇప్పుడు ఆ దేశం నుంచి ఆర్డర్లు తగ్గిపోతాయని వీరి ఆందోళన పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత టెక్స్‌టైల్‌ రంగం నుంచి 36.61 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరగగా వాటిలో 28 శాతం అమెరికాకే చేరిన సంగతి గమనార్హం.

ప్రత్యామ్నాయాల వైపు అమెరికా సంస్థలు?

బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలపై ఇప్పటికే 20 శాతం మాత్రమే టారిఫ్‌లు ఉన్న నేపథ్యంలో, అమెరికా సంస్థలు భారత స్థానం లో బదులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇది భారత టెక్స్‌టైల్ రంగానికి దీర్ఘకాలికంగా ప్రమాదం కలిగించే అంశంగా పరిశీలిస్తున్నారు.

రష్యా చమురు కారణంగా తలెత్తిన వివాదం

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ప్రతీకార చర్యగా ట్రంప్‌ ఈ సుంకాలను విధించారు. ఇప్పటికే అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్‌లను మరోసారి పెంచి 50 శాతానికి తీసుకెళ్లారు. ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ ప్రభావం భారత టెక్స్‌టైల్‌తో పాటు, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే కనిపించనుంది.

అమెరికా ట్రంప్‌ సుంకాల నిర్ణయం భారత టెక్స్‌టైల్‌ పరిశ్రమను గట్టి దెబ్బతీసేలా మారుతోంది. ఇది కేవలం తాత్కాలికమేనా? లేక దీర్ఘకాలిక ప్రభావం ఉండబోతోందా? అనేది పరిశ్రమ వర్గాల ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది. ఇటువంటి పరిణామాల మధ్య, భారత్‌ తన ఎగుమతుల సామర్థ్యం విస్తరించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News