ట్రంప్ టారీఫ్ ల దెబ్బ.. ప్రపంచ మార్కెట్లు కుదేలు.. స్పందించిన భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.;

Update: 2025-04-03 08:09 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో భారీ కుదుపు కనిపించింది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పసిడి కొత్త రికార్డును నమోదు చేసింది.

ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బకు ఆసియా మార్కెట్లు షేక్‌ అయ్యాయి. గురువారం ఉదయం జపాన్‌ నిక్కీ 3.4 శాతానికి పైగా నష్టపోయింది. అమెరికా ఈ దేశంపై 24 శాతం సుంకాలు విధించింది. దక్షిణ కొరియా కోస్పీ 1.9 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 1.8 శాతం మేర నష్టాలతో ట్రేడవుతున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా గురువారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్‌ ప్రకటనకు ముందు స్వల్ప లాభాల్లో ఉన్న అమెరికా మార్కెట్లు, ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్‌ సూచీ 3 శాతం, డోజోన్స్‌ ఫ్యూచర్‌ సూచీ 2 శాతం, నాస్‌డాక్‌ ఫ్యూచర్‌ సూచీ 4 శాతం మేర పతనమయ్యాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.

ప్రపంచ మార్కెట్ల అస్థిరత కారణంగా మదుపర్లు బంగారం వైపు చూడటంతో పసిడి ధరలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అమెరికా మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 0.4 శాతం పెరిగి 3,145.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో ఇది 3,167.57 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో ఔన్సు ధర 0.1 శాతం పెరిగి 3,170.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

గురువారం చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ధర 2.63 శాతం తగ్గి బ్యారెల్‌కు 72.98 డాలర్లకు చేరింది. క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 2.76 శాతం తగ్గి 69.73 డాలర్లకు పడిపోయింది. ఇక, గురువారం నాటి మార్కెట్లో భారత రూపాయి విలువ 10-15 పైసలు క్షీణించే అవకాశం ఉంది.

-ట్రంప్ టారీఫ్ లపై స్పందించిన భారత్

భారత్‌పై ట్రంప్‌ ఏకంగా 26 శాతం సుంకాలు విధించారు. ఇందులో 10 శాతం ఏప్రిల్ 5 నుంచి, మిగిలిన 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ఈ సుంకాలను భారత్ ఎదురుదెబ్బగా భావించడం లేదు. అమెరికా ఆందోళనలను పరిష్కరించగలిగితే సుంకాల్లో తగ్గింపు ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్‌ మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ తన గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని, తమ ఉత్పత్తులపై 52 శాతం సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. అందుకే తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్‌ బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లో టారిఫ్‌లపై ప్రకటన చేశారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News