దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల అధిపత్యం నడుస్తుందా?

తన టీంలో మెంబర్ పై విరుచుకుపడినట్లుగా.. ఒక దేశాధినేతపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ట్రంప్ తీరును ప్రపంచం మౌనంగా చూస్తోంది.;

Update: 2025-05-24 05:40 GMT

వైట్ హౌస్ కు వచ్చిన వివిధ దేశాధినేతలపై నోరు పారేసుకోవటం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నారు. తన టీంలో మెంబర్ పై విరుచుకుపడినట్లుగా.. ఒక దేశాధినేతపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ట్రంప్ తీరును ప్రపంచం మౌనంగా చూస్తోంది. అంతకు మించి ఇంకేమీ చేయలేని పరిస్థితి. తాజాగా దక్షిణాఫ్రియా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వ్యవహరించిన తీరును చూసిన ప్రపంచం ఒక్కసారిగా అవాక్కు అయిన పరిస్థితి.

తమ దేశానికి అతిధిగా వచ్చిన ఒక దేశాధినేతతో వ్యవహరించటం ఇదేనా? అన్నది ప్రశ్నగా మారింది. మొన్న ఫిబ్రవరిలో తనతో భేటీ కోసం వచ్చిన ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీతోనూ ట్రంప్ ఇదే తీరును ప్రదర్శించారు. కాకుంటే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తనకొస్తున్న చిరాకును బలవంతంగా అదిమి పెట్టుకొని ఉండిపోయారు. తనలో చెలరేగుతున్న అసహనాన్ని అడ్డుకోవటానికి ఆయన చాలానే శ్రమించారు. అంతేకాదు.. తనకు అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ట్రంప్ కు తనదైన శైలిలో మర్యాదపూర్వకంగా కౌంటర్లు ఇవ్వటం కనిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ట్రంప్ చెప్పినట్లు దక్షిణాఫ్రియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ శ్వేత జాతీయుల్ని నల్లజాతీయులు చెండుకు తింటున్నారా? అక్కడి క్రైం లో జరుగుతున్నదేంటి? ఎవరు బాధితులు? ఎవరు బాధ్యులు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్నివెతికినప్పుడు.. వాస్తవాల కోసం శోధన చేసినప్పుడు ట్రంప్ వాదనల్లో పస లేదన్న విషయం అర్థమవుతుంది. తనకు తెలిసిన పరిమిత సమాచారాన్ని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడారన్న అంశం స్పష్టమవుతుంది.

అదెలా అన్నది చూస్తే..దక్షిణాప్రికా మీద ట్రంప్ అభ్యంతరాల్లో ముఖ్యమైనది.. ఆ దేశంలోని శ్వేతజాతీయుల ఊచకోత సాగుతోందని. వాటిల్లో చాలావరకు వివరాలుబయటకు రావటం లేదని. ట్రంప్ చేసిన ఆరోపణలకు స్పందించిన దక్షిణాఫ్రియా అధ్యక్షుడు. మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని అడిగితే.. లేవని చెబుతూ ఒక వీడియోను ప్రదర్శించారు. ఇదంతా నాలుగు గోడల మధ్య జరగలేదు. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే మరో దేశాధినేతపై ట్రంప్ విరుచుకుపడి.. తన అధిక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేశారని చెప్పాలి.

వాస్తవాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలో ఇప్పటికి కూడా వ్యవసాయ భూమిలో నాలుగింట మూడు వంతులభూములు శ్వేతజాతీయులదే. ఆ దేశ జనాభాలో వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 8 శాతం కంటే తక్కువ. అంటే.. జనాభాలో 80 శాతానికి పైనే ఉండే నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా మాత్రం కేవలం 4 శాతమే. ట్రంప్ చేసిన మరో ఆరోపణ ఏమంటే.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకొని వాటిని నల్లజాతీయులకు ఇస్తుందన్నది. అదే నిజమైతే.. ఇప్పటికి నల్లజాతీయుల వద్ద భారీగా భూములు పోగుపడి ఉండాల్సింది కదా? అలా ఎందుకు జరగనట్లు?

శ్వేతజాతి రైతుల ఊచకోత జరుగుతుందన్న ట్రంప్ వాదనలోనూ పస లేదు. ప్రపంచంలో అత్యధిక నేరాల రేటు దక్షిణాఫ్రియాలో ఉంది. అక్కడ సగటున 72 హత్యలు జరుగుతాయి. 6కోట్ల జనాభా కలిగిన ఆ దేశంలో హత్యకు గురయ్యే వారిలో అత్యధికులు నల్లజాతీయులే. ట్రంప్ లెక్క ప్రకారం ఆ జాబితాలో శ్వేతజాతీయులు ఉండాలి కదా? అలా లేకపోవటాన్ని ట్రంప్ గుర్తించలేదు.

గత ఏడాది హత్యకు గురైన 26,232 మందిలో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. మిగిలిన వారంతా నల్లజాతీయులే. ఈ లెక్కన దక్షిణాఫ్రియాలో జరుగుతున్నదేంటి? ట్రంప్ చెప్పేదేమిటి? అన్నది ప్రశ్న. విషయాల్ని తనకు అనుకూలంగా మార్చుకొని మాట్లాటం అమెరికాకు మొదట్నించి ఉన్న అలవాటే. తన ప్రయోజనాలకు అనుగుణంగా వాదనల్ని వినిపించే విషయంలోనూ అమెరికా ముందు ఉంటుంది. ఈ విషయాన్ని ట్రంప్ మరింత చక్కగా ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News