ట్రంప్ దెబ్బ..రష్యా నుంచి ఆయిల్ బంద్.. భారత్ ఏం చేయనుంది?
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.;
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రష్యన్ చమురు దిగుమతులపై భారీ ఆంక్షలు విధించారు. దాంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.
రష్యా నుంచి చమురు దిగుమతులు తాత్కాలికంగా నిలిపివేత
రష్యా చమురు సంస్థలు ‘రాస్‌నెఫ్ట్’, ‘లుకాయిల్’.. వాటి అనుబంధ సంస్థలపై అమెరికా నిషేధం విధించడంతో భారత రిఫైనరీలు కొత్త చమురు ఆర్డర్లను నిలిపివేశాయి. ఆంక్షల అమలుపై మరింత స్పష్టత కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నాయి. ఈ లోటును తీర్చుకోవడానికి రిఫైనరీలు స్పాట్ మార్కెట్ల నుంచి చమురు కొనుగోళ్లు ప్రారంభించాయి. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ‘ఎకనామిక్ టైమ్స్’ కు వెల్లడించాయి.
*అమెరికా హెచ్చరిక – ఆంక్షలు ఉల్లంఘిస్తే పెనాల్టీ!
అమెరికా అక్టోబర్ 22న ప్రకటించిన ఆంక్షల ప్రకారం, ఈ రెండు రష్యన్ సంస్థలతో అమెరికా కంపెనీలు మాత్రమే కాకుండా ఇతర దేశాల సంస్థలు కూడా లావాదేవీలు చేస్తే జరిమానాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 21 నాటికి అన్ని కొనసాగుతున్న లావాదేవీలను ముగించాలని వాషింగ్టన్ స్పష్టం చేసింది.
భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా
ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. 2025లో ఇప్పటివరకు రోజుకు సగటు 1.7 మిలియన్ బారెల్స్ చమురు భారత్ దిగుమతి చేసుకుంది. అందులో 1.2 మిలియన్ బారెల్స్ రాస్‌నెఫ్ట్ , లుకాయిల్ నుంచే వచ్చినవి. ఈ చమురును ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేశాయి.
* రిలయన్స్ స్పందన – ఆంక్షలకు కట్టుబడి ఉంటాం
రష్యా చమురుపై పెరుగుతున్న పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. “మేము యూరోపియన్ యూనియన్.. అమెరికా చట్టాల ప్రకారం నడుచుకుంటాం. ఆంక్షల ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం. అన్ని నియమాలు, మార్గదర్శకాలను గౌరవిస్తాం” అని తెలిపింది.
అమెరికా వైపు మొగ్గుచూపుతున్న భారత్
తాజా పరిణామాలతో భారత రిఫైనరీలు అమెరికాకు సహకారం అందిస్తున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య, మన కంపెనీలు అమెరికా - పశ్చిమాసియా నుంచి చమురు బుకింగ్‌లు పెంచుతున్నాయి.
రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కొత్త సమీకరణాలను తెచ్చాయి. ట్రంప్ ఆశించిన విధంగా భారత్ రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేయడం వాషింగ్టన్‌కు అనుకూలంగా మారింది. కానీ దీని ప్రభావం భారత్ ఇంధన ధరలు, దిగుమతి ఖర్చులపై ఎలా పడుతుందన్నది మాత్రం రాబోయే రోజుల్లో తేలనుంది.