యూఎస్ కాలేజీలకు వైట్ హౌస్ కొత్త రూల్స్... టార్గెట్ విదేశీ విద్యార్థులు!
విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్యను 15 శాతానికి పరిమితం చేయాలి. ఇదే సమయంలో ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించి ఉండకూడదు.;
రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ విదేశీ ఉద్యోగులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను టార్గెట్ చేసి పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తున్న ట్రంప్.. ఇప్పటికే చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసి, బహిష్కరణ నిర్ణయాల వరకూ వెళ్లారు! ఈ సమయంలో అమెరికా కళాశాలల్లో విదేశీ విద్యార్థులపై సరికొత్త మెలికలు పెట్టారు!
అవును... హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొనసాగిస్తోన్న దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది. అనంతరం ఆ వ్యవహారం కోర్టు మెట్లక్కడం, న్యాయస్థానం ట్రంప్ కు షాకివ్వడం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా అమెరికా కళాశాలల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని విశ్వవిద్యాలయాలకు ట్రంప్ సర్కార్ తేల్చిచెప్పింది. అలా కాని పక్షంలో అమెరికా ప్రభుత్వ నిధులు అందవని స్పష్టం చేసింది! ఈ మేరకు కొత్త రూల్స్ ని దేశంలోని టాప్ యూనివర్సిటీలన్నింటికీ పంపింది. దీంతో.. ఇది ట్రంప్ మార్కు బెదిరింపు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులు కావాలంటే.. యూనివర్సిటీలు తమ తమ కాలేజీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి.. విద్యార్థుల అడ్మిషన్ సమయంలో కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించడంతో పాటు జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం వంటివి చేపడితేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వైట్ హౌస్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కొత్త డిమాండ్లను వివరిస్తూ.. పెన్సిల్వేనియా యూనివర్సిటీ, వాండర్ బిల్ట్ యూనివర్సిటీ, దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, వర్జీనియా యూనివర్సిటీ, డార్ట్ మౌత్ కాలేజ్ లకు మెమో పంపినట్లు వైట్ హౌస్ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ సర్కార్ పెట్టిన సరికొత్త నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి.
* విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్యను 15 శాతానికి పరిమితం చేయాలి. ఇదే సమయంలో ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించి ఉండకూడదు. అండర్ గ్రాడ్యుయేట్ జనాభాను పరిమితం చేయాలి. దాంతో పాటు ఆయా దేశాల నుంచి అందే నిధుల వివరాలను బహిర్గతం చేయాలి.
* విద్యార్థుల అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్ సమయంలో లింగ, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోకూడదు.
* విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలుచేయడంతో పాటు.. సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బందిపెట్టే, దాడులకు పాల్పడే యూనిట్స్ ను తొలగించాలి.
* విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలి.
* ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి.
* అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్ష రాయవలసి ఉంటుంది.
* బాత్ రూమ్ లు, లాకర్ రూమ్ లలో "సింగిల్ సె*క్స్ స్పేస్" లను నిర్వహించాలి.
ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని రెండేళ్లపాటు ఆపేస్తారు. ఈ నేపథ్యంలో... అమెరికాలో ఉన్నతవిద్యను పునర్ వ్యవస్థీకరించి, తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం చేస్తున్న మరో యత్నంగా పలువురు ఈ సరికొత్త నిర్ణయాన్ని అభివర్ణిస్తున్నారు.