ట్రంప్ అక్కడుంది పుతిన్... నువ్వు అనుకున్నంత ఈజీ కాదు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే భారత్ తో సహా ప్రపంచ దేశాలకు ట్రంప్ వ్యవహర శైలి అర్ధమైపోయిందని అంటారు.;

Update: 2025-07-14 05:26 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే భారత్ తో సహా ప్రపంచ దేశాలకు ట్రంప్ వ్యవహర శైలి అర్ధమైపోయిందని అంటారు. అయితే పాకిస్థాన్ విషయంలోనూ, ఇరాన్ విషయంలోనూ సాగినట్లుగా రష్యా, ఉక్రెయిన్ విషయంలో సాగడంలేదనే కామెంట్లు ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... నిన్నటివరకూ ట్రంప్ అంతటివారు, ఇంతటివారు అని చెప్పిన పుతిన్ తాజాగా షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఉక్రెయిన్‌ తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్‌ .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై మరోసారి మండిపడ్డారు. ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అన్నారు.

నిన్నటి వరకూ ఒకరిని ఒకరు పొగుడుకున్నట్లు కనిపించిన ట్రంప్ - పుతిన్ ల మధ్య మళ్లీ పడింది. తన మాట వినకపోతే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో పుతిన్ కి మరోసారి తెలిసొచ్చినట్లయ్యింది. ఇందులో భాగంగా.. పుతిన్‌ ఉద్దేశమేంటో అర్థమవుతోంది.. పగలు ఆయన చాలా అందంగా మాట్లాడుతారు.. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడుతారు అంటూ ట్రంప్ మొదలుపెట్టారు.

ఇదే సమయంలో... అలాంటి ప్రవర్తన మాకు నచ్చట్లేదు అని ట్రంప్‌ ఫైరయ్యారు. ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షల విధించే అంశాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఇందులో భాగంగా... రష్యాపై కొత్త, కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. దీనిపై ఏం చేద్దామో సోమవారం చూద్దామని అన్నారు. దీంతో రష్యా విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

కాగా.. రష్యాపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యునైటెడ్ స్టేట్స్ సెనెటర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌ లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు సాయం చేసే విషయంలో ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... రష్యాతో సుమారు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌ కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్‌ అంగీకారం తెలిపారు. పేట్రియాట్ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ను కీవ్‌ కు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరమని అన్నారు. అయితే, ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

Tags:    

Similar News