ట్రంప్, మస్క్ విభేదాలు ప్రశ్నార్థకంగా భారత వ్యోమగామి ప్రయాణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ విభేదాల నేపథ్యంలో మస్క్ తన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ సేవలను నిలిపివేస్తానని ప్రకటించారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ విభేదాల నేపథ్యంలో మస్క్ తన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ సేవలను నిలిపివేస్తానని ప్రకటించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ తాను ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలను రద్దు చేస్తే బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయని అన్నారు. సరిగ్గా ఈ సమయంలో.. భారత వ్యోమగామి అంతరిక్ష ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) మిషన్లలో క్రూ డ్రాగన్ సేవలు చాలా కీలకం. జూన్ 10న సుభాన్షు శుక్లా అనే భారత వ్యోమగామి క్రూ డ్రాగన్ సహాయంతోనే అంతరిక్షంలోకి వెళ్లాలి. మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ కంపెనీ క్రూ డ్రాగన్ అంతరిక్షంలోకి వ్యోమగాములను చేరవేయడంలో చాలా ముఖ్యమైనది కాబట్టి, ఇది ఆక్సియమ్-4 మిషన్‌పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
భారత్ , అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆక్సియమ్-4 మిషన్‌లో నాసా (NASA), స్పేస్‌ఎక్స్ (SpaceX), ఇస్రో (ISRO) పాల్గొంటున్నాయి. ఈ మిషన్‌లో సుభాన్షు శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగేరీలకు చెందిన ముగ్గురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్తారు. అయితే, ఈ మిషన్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. కొత్త సమాచారం ప్రకారం.. ఈ నెల 10వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:52 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి వీటిని ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. "భారతీయులందరూ ఈ మిషన్‌ను చూడాలి. భవిష్యత్తు గురించి ధైర్యంగా కలలు కనాలి" అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 అమెరికా ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నాయకులు ఓడిపోయేవారని మస్క్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అధ్యక్షుడు సె*క్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ తో సంబంధాలు పెట్టుకున్నారని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్‌ను పదవి నుండి తొలగించాలని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాలు శుక్లా అంతరిక్ష మిషన్‌పై మొత్తం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.