ట్రంప్ ను వద్దు అంటున్న సొంత పార్టీ, యూఎస్ ప్రజలు

యుద్ధ వ్యతిరేక భావనలు దేశవ్యాప్తంగా బలపడుతుండటం.. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుండటంతో ట్రంప్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.;

Update: 2026-03-10 12:19 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయని ప్రకటించినప్పటికీ, ఈ ప్రకటన వెనుక సైనిక విజయాల కంటే రాజకీయ అనిశ్చితే ఎక్కువగా కనిపిస్తోంది. యుద్ధ వ్యతిరేక భావనలు దేశవ్యాప్తంగా బలపడుతుండటం.. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుండటంతో ట్రంప్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సొంత పార్టీలోనే పెరిగిన అసంతృప్తి

ఒకప్పుడు ట్రంప్ నిర్ణయాలకు వెన్నెముకగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ నేతలే ఇప్పుడు ఆయన యుద్ధ విధానాన్ని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మిడ్‌టర్మ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలు ఓటర్లను దూరం చేస్తాయని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కొనసాగితే అది డెమోక్రాట్ల గెలుపుకు మార్గం సుగమం చేస్తుందని.. ఫలితంగా అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. తన సన్నిహిత సలహాదారులు కూడా సంయమనం పాటించడమే మేలని సూచిస్తున్నట్లు సమాచారం.

ఆర్ధిక భారం.. ప్రజల ఆగ్రహం

ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావం నేరుగా అమెరికా సామాన్యుడిపై పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో జరిగిన భారీ నష్టాలను చవిచూసిన అమెరికన్ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధంగా లేరని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

అంతర్జాతీయ ప్రతిష్ఠ.. రాజకీయ సమీకరణాలు

కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అమెరికా ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ కూడా తన పంతాన్ని వీడేలా లేకపోవడంతో యుద్ధాన్ని కొనసాగించడం అమెరికాకు వ్యూహాత్మకంగా కూడా నష్టదాయకమే. ఓట్ల రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టడం సరికాదన్న వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

మొత్తంగా ట్రంప్ ప్రకటించిన 'యుద్ధ ముగింపు' అనేది ఆయన సైనిక విజయం కంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న రాజకీయ నిర్ణయమేనని చెప్పక తప్పదు. పార్టీ అంతర్గత ఒత్తిళ్లు, ప్రజల వ్యతిరేకత, దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థ.. ఇవన్నీ కలగలిసి ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశాయి. రాబోయే కాలంలో ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవితవ్యాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News