రష్యా యుద్ధానికి భారత్ సుంకాలకు సంబంధమేంటి ట్రంప్?
ఉక్రెయిన్‌తో సాగుతున్న రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది.;
ఉక్రెయిన్‌తో సాగుతున్న రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు విధించిన గడువు తాజాగా ముగియనున్న నేపథ్యంలో, వాషింగ్టన్-మాస్కో మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సంధర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి నమోదు అయిందని తెలిపారు. ఇందుకు భారతదేశంపై విధించిన అదనపు సుంకాలు కూడా ఒక కారణమవొచ్చని అభిప్రాయపడ్డారు. మాస్కో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే, భారత్‌పై విధించిన టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని ఆయన సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం- భారతదేశంపై విధించిన సుంకాలకు మధ్య ఆయన పెట్టిన లింక్ అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యూహం
ట్రంప్ ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి మాస్కోకు పంపించారు. ఈ చర్చలు విజయవంతమయ్యాయని, యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కృషి ఫలితంగా త్వరలో పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో త్రైపాక్షిక చర్చలు నిర్వహించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ సమావేశానికి ఏ ఇతర యూరోపియన్ దేశాల నేతలను ఆహ్వానించబోమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.
భారత్‌పై 50% సుంకాల పెంపు
రష్యాలో చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, "భారత్‌పై మేము 50 శాతం సుంకాలు విధించాం. దీని ప్రభావం ఏమైందో ఖచ్చితంగా చెప్పలేను. కానీ రష్యాతో మా చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. మాస్కో చమురు కొనుగోలు చేసేవారిపై పెనాల్టీలు కొనసాగుతాయి" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్ - రష్యా మధ్య ఉన్న సంబంధాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి.
-సుంకాల తగ్గింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశంపై సుంకాలకు మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా.. ఒక కీలకమైన సూచన చేశారు. రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరిస్తే, భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను తగ్గిస్తారా అని ఒక విలేకరి అడిగినప్పుడు, ట్రంప్ "అలా జరిగే అవకాశం ఉంది" అని బదులిచ్చారు. అయితే, ప్రస్తుతానికి భారత్ 50 శాతం సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా రష్యాను ఒత్తిడిలోకి నెట్టడానికి, అదే సమయంలో భారతదేశంపై సుంకాల భారాన్ని ఉపయోగించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ యొక్క ప్రత్యేకమైన , సంక్లిష్టమైన విధానాన్ని ప్రతిబింబిస్తోంది.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనలు భారతదేశం-అమెరికా సంబంధాలు.. అంతర్జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.