నో ఎక్స్ టెన్ష‌న్‌: చెప్పిన టైంకే సుంకాల బాదుడు!

చ‌ప‌ల చిత్తానికి ప్ర‌తీక‌గా నిలిచే.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌దు.;

Update: 2025-08-22 06:57 GMT

చ‌ప‌ల చిత్తానికి ప్ర‌తీక‌గా నిలిచే.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌దు. ముందు పేట్రేగిపోయే ఆయ‌న త‌ర్వాత కూల్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. చైనాతో 100 శాతం సుంకాల యుద్ధం చేస్తున్నామ‌ని చెప్పిన‌.. 24 గంట‌ల్లోనే.. 50 శాతానికి.. త‌ర్వాత‌.. 25 శాతానికి కూడాదిగి వ‌చ్చారు. అంతేకాదు.. రేపే సుంకాలు అమ‌ల్లోకి వ‌స్తున్నాయ‌ని చెప్పి.. నెల‌ల త‌ర‌బ‌డి వాటి అమ‌లును పొడిగించారు. ఇదీ.. ట్రంప్ వ్య‌వ‌హార శైలి.

ఈ క్ర‌మంలో భార‌త్ విష‌యంలోనూ ఆయ‌న ఇలానే వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేసుకున్నారు. కానీ.. ట్రంప్ మాత్రం లేదు లేదు.. భార‌త్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. `నో ఎక్స్ టెన్స‌న్‌` అని బోర్డు పెట్టేశారు. భార‌త్‌పై అద‌నంగా విధించిన సుంకాలు.. ఈ నెల 27 నుంచి(అంటే.. మ‌రో నాలుగు రోజుల్లో) అమ‌ల్లోకి రానున్నాయి. అయితే.. కాస్త పొడిగింపు ఉంటుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నరావో బాంబు పేల్చారు.

''ట్రంప్ ఉద్దేశం ప్ర‌కారం. భార‌త్‌కు నో ఎక్స్ టెన్ష‌న్ టైమ్‌.'' అని న‌రావో తేల్చేశారు. అంటే.. అద‌నంగా విధించిన 25 శాతం సుంకాలు.. ఇప్ప‌టికే విధించిన 25 సుంకాలు క‌లిపి ఈ నెల 27 నుంచి మొత్తంగా 50 శాతం సుంకాలు.. అమ‌ల్లోకి రానున్నాయ‌న్న మాట‌. ''సుంకాల్లో భారత్‌ను ‘మహారాజ్‌’. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్‌ కొనసాగిస్తోంది'' అని ఎద్దేవా చేయ‌డం గ‌మ నార్హం.

అంతేకాదు. అవ‌స‌రం లేకున్నా.. భార‌త్ ర‌ష్యానుంచి ఇంధ‌నం కొనుగోలు చేస్తోంద‌ని న‌రావో ఆరోపించా రు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం చేయ‌క‌ముందు.. కేవ‌లం 1 శాతం మాత్ర‌మే ఇంధ‌నం కొనుగోలు చేసిన భార‌త్‌.. ఇప్పుడు 35 శాతం ఇంధ‌నం కొంటోందన్నారు. ఇది ర‌ష్యాను పోషించేందుకు భార‌త్ తీసుకున్న నిర్ణ‌యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. త‌క్కువ ధ‌ర‌లకు వ‌స్తోంద‌ని.. భార‌త్ ఇలా కొంటోంద‌ని.. దీనిని రీ సైక్లింగ్ చేసి.. యూరప్ దేశాల‌కు విక్ర‌యిస్తున్నార‌ని.. కాబ‌ట్టి.. సుంకాలు విధించ‌డం త‌ప్పుకాద‌ని వ్యాఖ్యానించారు.

మోడీపై వ్యంగ్యం..

ఈ సంద‌ర్భంగా న‌రావో.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీని గొప్ప నాయ‌కుడు అంటూనే.. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తూ.. తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''ప్రస్తుతం మోడీ చేస్తున్న పనులు శాంతి కోసం కాదు.. ర‌ష్యా-ఉక్రెయిన్‌ల మ‌ధ్య‌ యుద్ధాన్ని శాశ్వతంగా జ‌రిగేలా చేస్తున్నారు'' అన్నారు. అందుకే సుంకాలు విధించామ‌ని చెప్పుకొచ్చారు. కానీ, వాస్త‌వానికి ర‌ష్యానుంచి ఎక్కువ మొత్తంలో చ‌మురు కొనుగోలు చేస్తున్న దేశం చైనానేన‌ని భార‌త్ చెబుతోంది.

Tags:    

Similar News