భారత్, పాక్ యుద్ధం ఎందుకు ఆపాయంటే... కొత్త పేరుతో ట్రంప్ పాత పాట!

అయితే ఈ వాణిజ్య వ్యూహం కేవలం భారత్, పాక్ కు మాత్రమే పరిమితం కాలేదని.. ఇదే వ్యూహాన్ని ఇతర చోట్లా ఉపయోగించానని ట్రంప్ చెప్పుకున్నారు.;

Update: 2025-06-28 04:52 GMT

ట్రంప్ మారడం లేదు! మోడీ ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, మరెంత స్పష్టంగా చెప్పినా భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెబుతూనే ఉన్నారు. అయితే.. ఈ సారి కాస్త మార్చినట్లే మార్చి మళ్లీ అక్కడికే వచ్చారు. ఈ సందర్భంగా తెరపైకి మరొకరి పేరు తీసుకొచ్చారు. కానీ.. అర్ధం మాత్రం అదే! వాణిజ్యాన్ని అడ్డుపెట్టే యుద్ధాన్ని ఆపానని!

అవును... భారతదేశం, పాకిస్తాన్ మధ్య అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటానని బెదిరించడం వల్లే ఆ రెండు దేశాల మధ్య ఉన్న అణు యుద్ధాన్ని తాను ఒంటరిగా అణచివేశానని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ లు పోరాటాన్ని ఆపకపోతే వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... యుద్ధాన్ని కొనసాగిస్తే, ట్రంప్ రెండు దేశాలతో అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలనుకుంటున్నారని.. భారతదేశం, పాకిస్తాన్‌ లకు ఫోన్ చేసి చెప్పమని సీనియర్ అధికారి హోవార్డ్ లుట్నిక్‌ ను అడిగానని.. దీంతో, అతడు రెండు దేశాలకు ఫోన్ చేసి విషయం చెప్పాడని.. ఆపై పోరాటం మానేశాయని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

ఇదే సమయంలో... భారర్ - పాకిస్తాన్ సరిహద్దులో నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత యుద్ధం ముగిసిందని.. అది అది బహుశా అణ్వాయుధ దాడి కావచ్చని.. ఈ నేపథ్యంలో తాము కొంత గొప్ప పని చేసామని.. ఇంతకంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారో లేదో తనకు తెలియదని ట్రంప్ చెప్పుకున్నారు!

అయితే ఈ వాణిజ్య వ్యూహం కేవలం భారత్, పాక్ కు మాత్రమే పరిమితం కాలేదని.. ఇదే వ్యూహాన్ని ఇతర చోట్లా ఉపయోగించానని ట్రంప్ చెప్పుకున్నారు. ఇందులో భాగంగా... సెర్బియా, కొసావో దేశాలు యుద్ధంలోకి దిగబోతున్నాయని.. ఫలితంగా పెద్ద యుద్ధం జరగబోతోందని అన్నారు. అయితే.. వారికి భారత్ - పాక్ విషయం చెప్పానని తెలిపారు!

కాగా... పాకిస్తాన్‌ తో ఉన్న ఉద్రిక్తతలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ట్రంప్ చేసిన వాదనలను భారత్ నిత్యం తిరస్కరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య చర్చల ఫలితమే కాల్పుల విరమణ ఒప్పందం అని న్యూఢిల్లీ పేర్కొంది.

Tags:    

Similar News