ఓ ట్రంపూ...కోట్లు కుమ్మరించి కొనేస్తావా?

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు...మంచి వ్యాపారి కూడా. తనకంట పడ్డ...తనకు నచ్చింది ఏదైనా సరే కోట్ల డాలర్లు కుమ్మరించయినా సరే సొంతం చేసుకునే దాకా నిద్రపోనేపోరు.;

Update: 2026-01-15 15:30 GMT

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు...మంచి వ్యాపారి కూడా. తనకంట పడ్డ...తనకు నచ్చింది ఏదైనా సరే కోట్ల డాలర్లు కుమ్మరించయినా సరే సొంతం చేసుకునే దాకా నిద్రపోనేపోరు. గ్రీన్ ల్యాండ్ విషయంలో ఇది నిజమని అక్షరాలా నిరూపిస్తున్నారు. తాజాగా ఆరునూరైనా సరే గ్రీన్ ల్యాండ్ నాకు కావాల్సిందే అని అంతర్జాతీయ వేదికగా ట్రంప్ స్పష్టం చేశాడు. డెన్మార్క్ గ్రీన్ ల్యాండ్ నేతలు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో చర్చలు ప్రారంభించడం కన్నా ముందుగానే ట్రంప్ దుందుడుకుగా ఈ ప్రకటన చేశారు. తాంబూలాలు ఇచ్చేసా తన్నుకు చావండి అన్న రీతిలో ఉంటోంది ట్రంప్ వ్యవహారం. దీనికి ట్రంప్ వేస్తున్న ముసుగు...అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ ల్యాండ్ మాకు కావాలి అనే కొత్త రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు పైగా ఈ దీవి అమెరికాకు దక్కేలా నాటో సభ్య దేశాలు .చొరవ చూపాలని పిలుపునిచ్చారు కూడా.

అయితే గ్రీన్ ల్యాండ్ స్యయం ప్రతిపత్తి కలిగిన ద్వీపమే కాదు పరస్పర అంగీకారం ఒప్పందంతో డెన్మార్క్ పాలిస్తున్న ప్రాంతం కావడంతో ట్రంప్ డీల్ అంత సులువు కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ల్యాండ్, డెన్మార్ అధినేతలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మీడియా చానెళ్లలో గ్రీన్ ల్యాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే దాదాపు 700 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్న వార్త చక్కర్లు కొడుతోంది. మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే రూ.58 లక్షల కోట్లు. అయితే ఇది ఆధికారిక సంఖ్య కాదుకానీ, గ్రీన్ ల్యాండ్ కొనుగోలు చేయాలంటే అమెరికా ఖజానాపై చెప్పలేనంత భారం పడటం మాత్రం ఖాయం అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రీన్ ల్యాండ్ ఫారిన్ మినిస్టర్ మాత్రం ట్రంప్ తమ ద్వీపాన్ని ఎలాగైనా కొనాలని పంతంపై ఉన్నట్లు చెబుతున్నారు. గ్రీన్ ల్యాండ్ అమెరికా వశం కాకపోతే అది తప్పకుండా రష్యా, చైనా దేశాల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ట్రంప్ బాధ. అదే విషయాన్ని బైటికి చెబుతున్నారు కూడా.

మరోపక్క గ్రీన్ ల్యాండ్ అధినేతలు ట్రంప్ వైఖరిని దారుణంగా విమర్శిస్తున్నారు. అతని సామ్రాజ్యధోరణిని విడనాడాలని అంటున్నారు. గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ అంతర్భాగంగా ఎప్పటికీ నాటో లో ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అత్యుత్సాహంతో గ్రీన్ ల్యాండ్ ను వశపరచుకోడానికి సైనికచర్యల్లాంటి చర్యలకు పూనుకుంటే నాటో నూరు ముక్కలు కావడం ఖాయం అని గ్రీన్ ల్యాండ్ నేతలు అంటున్నారు. ఇప్పటికే డెన్మార్క్ ప్రధాని ఫ్రెడిరిక్సన్, గ్రీన్ ల్యాండ్ ప్రధాని జెన్స్ ప్రెడెరిక్ నీల్సన్ లు పరస్పర సంఘీభావం ప్రకటించుకున్నారు. గ్రీన్ ల్యాండ్ ప్రజలు కూడా మా ద్వీపాన్ని, మమ్మల్ని డాలర్లతో కొనేయాలని చూస్తున్నారా? అది కుదరని పని అంటూ ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గ్రీన్ ల్యాండ్ వాసులారా ఈరోజు కలిసి ఉన్నాం ...ఎప్పటికీ కలిసి ఉంటామంటూ సాక్షాత్తు శ్వేతసౌధంలోనే డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. మరి ఈ ప్రకటనలు ట్రంప్ చెవికెక్కుతాయా అంటే అనుమానమే. ఇదే విషయాన్ని డెన్మార్క్ ప్రధాని విలేకరులతో మాట్లాడుతూ...అమెరికా, డెన్మార్క్ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలంటే...మరో మాట లేకుండా డెన్మర్క్, యూరోపియన్ యూనియన్, నాటో కూటమి, డెన్మార్క్ రాజ్యాన్నే ఎంచుకుంటామని అన్నారు.

గ్రీన్ ల్యాండ్ ప్రధాని నీల్సన్ చేసిన ప్రకటనలకు ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు...నీల్సన్ అభిప్రాయంతో మాకు పనిలేదు. అది అతని సమస్య. కానీ గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ లో కొనసాగాలంటే మాత్రం గ్రీన్ ల్యాండ్ కే సమస్య అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ల్యాండ్ అమెరికా సొంతం కావాలి. లేదంటే ఇప్పటికే రష్యా, చైనా సైన్యాలు అక్కడ మోహరించాయి. నేను అనుకుంటే అంతకు రెట్టింపు సైన్యాన్ని అక్కడ పెట్టగలనని ట్రంప్ అంటున్నారు. ఈ లెక్కన ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ను వదిలేలా లేరు. రష్యా ఎలాగూ ఆర్థికంగా బలహీనపడింది కాబట్టి ఆ దేశాన్ని మరింత అస్థిర పరిచే ప్రయత్నాలు కొనసాగించేందుకే ట్రంప్ ముందడుగు వేస్తారు. మరి గ్రీన్ ల్యాండ్ స్వాధీన క్రమంలో నాటో ముక్కలయినా ట్రంప్ పట్టించుకోరా? అంటే ఏమో చూడాలి...ఈ నయా వ్యాపారి మాత్రం కోట్లు కుమ్మరించయినా సరే గ్రీన్ ల్యాండ్ కొనడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

Tags:    

Similar News