నమస్తే ట్రంప్, హౌడీ మోడీ...మోడీ నా ఫ్రెండ్...ఇవన్నీ ఏమయ్యాయి ?

గతకాలం మేలు వచ్చు కాలం అంటే ఇదేనేమో. పాత రోజులు పాత ముచ్చట్లు ఇవన్నీ ఇపుడు చిత్రంగా ఉన్నాయి.;

Update: 2025-05-24 16:03 GMT

గతకాలం మేలు వచ్చు కాలం అంటే ఇదేనేమో. పాత రోజులు పాత ముచ్చట్లు ఇవన్నీ ఇపుడు చిత్రంగా ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ 2016లో తొలిసారి నెగ్గారు, దాని కంటే రెండు ఏళ్ళ ముందు భారత్ లాంటి సువిశాల దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. దాంతో ఈ ఇద్దరి మధ్యన మంచి దోస్తీ కుదిరింది.

ఈ ఇద్దరూ ఎంతలా అంటే జన్మ జన్మ బంధంగా అంతర్జాతీయంగా కనిపించేవారు. మోడీ అంటే ఎంతో ఆప్యాయత ట్రంప్ చూపిస్తే ట్రంప్ మళ్ళీ 2020 ఎన్నికల్లో గెలవాలని మోడీ తపించారని అప్పట్లో చెప్పుకునేవారు. అంతలా అల్లుకున్న ఈ బంధానికి ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక బీటలు వారిందా అన్నదే చర్చగా ఉంది.

ఇదంత చూసిన వారు నమస్తే ట్రంప్, హౌడీ మోడీ మోడీ నా ఫ్రెండ్ ఇవన్నీ ఏమయ్యాయి అని చర్చించుకుంటున్నారు. అసలు ట్రంప్ మారిపోయారా లేక మోడీ నాయకత్వంలోని భారత్ విధానంలో ఏమైనా మార్పులు ట్రంప్ కి కనిపించాయా అన్నది చర్చగా ఉంది. భారత్ విషయం తీసుకుంటే ఎపుడూ అమెరికాతో ఇంతలా ప్రతికూలత లేదు అని అంటున్నారు అంతర్జాతీయ దౌత్య నిపుణులు. భారత్ విషయంలో అమెరికా ఒక కంట ప్రేమ ఒక కంట అసూయతో చూసిన రోజులలో కూడా భారత్ మీద మరీ బాహాటంగా వ్యతిరేకత అగ్ర రాజ్యం అధినేతలు ఎవరూ చూపించలేదని అంటున్నారు.

కానీ ట్రంప్ సెకండ్ టెర్మ్ లో మాత్రం చాలా మారిపోయారు అనే అంటున్నారు. అమెరికా ఫస్ట్ అన్న ఆయన స్లోగన్ లో తప్పు లేదు కానీ భారత్ తో దోస్తీ సహజసిద్ధమైన బంధం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అన్న మాటలు ఇపుడు ఏమైపోయాయని అంతా అంటున్నారు. భారత్ మీద దాదాపుగా పగపట్టినట్లుగానే ట్రంప్ వ్యాఖ్యలు వైఖరి ఉన్నాయని అంటున్నారు.

భారత్ లో యాపిల్ మాన్యుఫ్యాక్చరింగ్ నిలుపుదల చేయాలని ఒకటికి పది సార్లు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. బెదిరించినట్లుగా మాట్లాడుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. పైగా యాపిల్ మీద భారీ సుంకాలు అమెరికా వేస్తుందని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ తీరుతో ట్రంప్ మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఇక భారత్ పాకిస్థాల మధ్య యుద్ధం నేనే ఆపాను అన్నారు ట్రంప్. కామన్ సెన్స్ తో రెండు దేశాలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాయని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని అంతా అనుకున్నారు. కామన్ సెన్స్ అన్న పదం వాడడమేంటి, పైగా పాకిస్థాన్ తో భారత్ ని కలిపి కట్టడమేంటి అన్న చర్చ సాగుతోంది.

అంతే కాదు అనేక రకాలైన స్టేట్మెంట్స్ ట్రంప్ ఇస్తున్నారు. వీటిని చూసిన వారు అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ఓపెన్ అయిపోయి భారత్ మీద విమర్శనాత్మకంగా సెటైరికల్ గా స్టేట్మెంట్స్ ఇస్తూంటే బీజేపీ పెద్దలు కానీ కేంద్ర పెద్దలు కానీ అధికారుల నుంచి కానీ సరైన కౌంటర్ ఎందుకు వెళ్ళడం లేదు అన్నదే సోషల్ మీడియాలో అంతా చర్చించుకుంటున్నారు.

ఇంతలా యాగీ చేస్తూ అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ని చిన్నబుచ్చుతున్నా కూడా ట్రంప్ ని ఎందుకు అలా వదిలేస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. ఆయన అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు కానీ భారత్ కి కాదు కదా అని అంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయిటే ట్రంప్ భారత్ కి డీఫ్యాక్టో పీఎం గా మారారా అని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అయితే ట్రంప్ కి ఈ రోజుకీ ప్రధాని స్థాయిలో సరైన కౌంటర్ పడలేదని ఎత్తి చూపిస్తున్నారు.

నేనే యుద్ధం ఆపాను అని ఒకటికి పదిసార్లు ట్రంప్ చెప్పుకుంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ట్రంప్ వ్యవహార శైలి చూస్తే భారత్ ని కూడా ప్రత్యర్ధిగానే చూస్తున్నారు అని అంటున్నారు. ట్రంప్ వచ్చాక వాణిజ్య విధానాల నుంచి దౌత్య విదేశాంగ విధానాల నుంచి చూస్తే అన్నింటా భారత్ నే ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. మరి ట్రంప్ ఇదే దూకుడు చేస్తూ పోతూంటే భారత్ కూడా ధీటుగా రియాక్ట్ కావాల్సిందే అన్నదే అంతా కోరుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఆ రకమైన ప్రతిస్పందన ఉంటుందేమో.

Tags:    

Similar News