సంచలనం.. వెనెజులాపై అమెరికా దాడి.. అదుపులో ఆ దేశ అధ్యక్షుడు
కొత్త సంవత్సరం 2026 యుద్ధాలతోనే మొదలయ్యేలా ఉంది. ఒకవైపు యెమెన్ అంతర్యుద్ధంతో మూడు ముక్కలు అయ్యేలా ఉండగా.. మరోవైపు ఉరుము లేని పిడుగులా వెనెజులాపై పడింది అమెరికా. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుంది.;
కొత్త సంవత్సరం 2026 యుద్ధాలతోనే మొదలయ్యేలా ఉంది. ఒకవైపు యెమెన్ అంతర్యుద్ధంతో మూడు ముక్కలు అయ్యేలా ఉండగా.. మరోవైపు ఉరుము లేని పిడుగులా వెనెజులాపై పడింది అమెరికా. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లుగా వెనెజులాపై కారాలు మిరియాలు నూరతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు ఏకంగా బాంబు దాడులకే దిగారు. దక్షిణ అమెరికా ఖండంలోని దేశమైన వెనెజులాలో నికొలస్ మదురో నాయకత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ట్రంప్ అసలు గుర్తించడమే లేదు. ఈ క్రమంలో ఆరు నెలల కిందటే ఆ దేశంపై దాడులకు ప్రయత్నాలు ప్రారంభించారు. విమానాలు, నౌకలను మోహరించి భారీగా సన్నాహాలు చేశారు. ఇప్పుడు శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధాని కరాకస్ పై అమెరికా సైన్యం బాంబు దాడులకు దిగింది. ఈ విషయాన్ని ట్రంప్ ధ్రువీకరించారు. అంతేకాక, మదురో ఆయన భార్య కూడా తమ అదుపులో ఉన్నారని, వారిని వెనెజులా నుంచి బటయకు తరలించామని చెప్పారు.
డ్రగ్స్ పేరు చెప్పి...
వెనెజులా అంటే ఒకప్పుడు సంపన్న దేశం. అంతేకాదు అమెరికాకు కొరుకుడుపడని దేశం. గతంలో వెనెజులాకు అధ్యక్షుడిగా పనిచేసిన హ్యూగో చావెజ్ (1999-2013)తోనూ అమెరికాకు తీవ్రమైన విభేదాలుండేవి. అతడి హత్యకు అమెరికా ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలున్నాయి. 2013లో చావెజ్ చనిపోయాక.. మదురో బాధ్యతలు చేపట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచినా దీనిని అమెరికా గుర్తించలేదు. 2025 నుంచి మొదలైన ఆయన పాలన 2031 వరకు కొనసాగనుంది. అయితే, ఆ దేశం నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని ట్రంప్ తరచూ మండిపడుతున్నారు. దానిని కట్టడి చేసే పేరిట గతంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఏకంగా కరాకస్ పై బాంబులు వేశారు. మొత్తం ఏడుచోట్ల పేలుళ్లు జరిగాయి.
వెనెజులాలో ఎమర్జెన్సీ..
అమెరికా బాంబు దాడులతో వెనెజులాలో మదురో ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఆ తర్వాత అతడి అమెరికా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అమెరికా... వెనెజులా సైనిక స్థావరాలను, ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఆర్మీ క్యాంప్ లలో విద్యుత్ నిలిచిపోయింది. కాగా, వెనెజులాను అమెరికా టార్గెట్ చేయడంతో పొరుగునుండే కొలంబియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెనెజులా కంటే కొలంబియాలోనే డ్రగ్స్ మాఫియా అధికం కావడమే దీనికి కారణం.
అధ్యక్షుడు కాదు డ్రగ్ డీలర్..
నికొలస్ మదురో అంటే కారాలు మిరియాలు నూరుతుంటారు ట్రంప్. అసలు మదురో ఎన్నికనే గుర్తించలేదు. ఆయనకు డ్రగ్స్ సరఫరా ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తుంటారు. అందుకే మదురో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా రోజుల కిందటే కరీబియన్ సముద్రంలో అమెరికా భారీగా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు. ఫైటర్ జెట్లను మోహరించింది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగి.. మదురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకుంది.