ఇరాన్ వార్ తర్వాత దారుణంగా పడిపోయిన ట్రంప్ గ్రాఫ్

అమెరికాలో ప్రముఖ వార్తా సంస్థలైన రాయిటర్స్.. ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ట్రంప్ పని తీరును 35 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నట్లుగా తేల్చారు.

Update: 2026-06-10 06:15 GMT

నువ్వు ఒకడి నెత్తి మీద చెయి పెడితే సరిపోదు. అలా పెట్టిన దాని ఫలితం అంతో ఇంతో నీకు వస్తుందన్న మాట కొందరు చెబుతుంటారు. ప్రపంచం మొత్తాన్ని ఆగమాగం చేసేలా దూకుడు నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. మానవాళికి ఇప్పుడు కావాల్సింది యుద్ధాలు కాదన్న విషయాన్ని ట్రంప్ పెడచెవిన పెట్టటమేకాదు.. ప్రాక్టికల్ గా వచ్చే ఇబ్బందుల్ని పక్కన పెట్టేసి.. మొండిగా.. మూర్ఖంగా ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధం.. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ మెడకు చుట్టుకున్నట్లుగా చెప్పాలి.

ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికాలో చోటు చేసుకున్న పరిస్థితులు.. పెరిగిన జీవన వ్యయం.. అధిక ధరలతో పాటు.. ఇరాన్ వార్ ఎఫెక్టు తమ జీవితాల మీద చూపించిన ప్రభావంపై అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇదంతా కలిసి ట్రంప్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే పరిస్థితికి వచ్చిందంటున్నారు. ఈ కారణంగానే ట్రంప్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత దారుణ పరిస్థితుల్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పాలి.

అమెరికాలో ప్రముఖ వార్తా సంస్థలైన రాయిటర్స్.. ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ట్రంప్ పని తీరును 35 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నట్లుగా తేల్చారు. ఆయన తన మొదటి విడత పదవీ కాలంలో నమోదైన 33 శాతం అత్యంత అట్టడుగు రేటింగ్ కాగా.. తాజాగా ఆయన ప్రజాదరణ ఇంచుమించు అదే స్థాయికి వచ్చి చేరినట్లుగా వెల్లడైంది.

ట్రంప్ సర్కార్ ఫారిన్ పాలసీలు.. ఆర్థిక పరిస్థితులు ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పాలి. పెట్రోల్.. డీజిల్ ధరలు.. ద్రవ్యోల్బణం అమెరికా ఓటర్లను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇదంతా ట్రంప్ ప్రభుత్వం మొదలు పెట్టిన ఇరాన్ యుద్దం కారణమన్న విషయాన్ని వారు బలంగా నమ్ముతున్నారు. వారం.. రెండు వారాల్లో యుద్దాన్ని చుట్టేస్తామని చెప్పి.. ఇప్పటికి ఏమీ తేలని పరిస్థితి. మరెప్పటికి యుద్ధం ముగుస్తుందో అర్థం కాని దుస్థితి. విపరీతమైన జీవన వ్యయం పెరిగేలా చేయటంలో ట్రంప్ విధానాలే కారణమని అమెరికన్లు భావిస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైంది.

అంతేకాదు.. పెరుగుతున్న జీవన వ్యయాన్ని కట్టడి చేయటంలో ట్రంప్ సర్కారు ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని 70 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లుగా సర్వే స్పష్టం చేసింది. ఈ జనాగ్రహం ట్రంప్ నకు రాజకీయంగా నష్టం కలిగించే అంశంగా చెబుతున్నారు. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యను 36 శాతం మంది సమర్థిస్తుంటే.. ఈ యుద్ధం కారణంగా తమకు లాభం కంటే నష్టాలే ఎక్కువని 25 శాతం మంది భావిస్తున్నట్లుగా సర్వేలో తేలింది. రానున్న రోజుల్లో ట్రంప్ ఎదుర్కొనే గడ్డు పరిస్థితిని ఈ సర్వే ముందే హెచ్చరించినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News