ట్రంప్ టారిఫ్ షాక్: మన దేశంపై ప్రభావం ఎంత? భారత్ కౌంటర్ ఏంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) భారత్‌పై భారీ ప్రభావాన్ని చూపనున్నాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) భారత్‌పై భారీ ప్రభావాన్ని చూపనున్నాయి. ఇప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్‌లను రెండింతలు చేసి 50 శాతానికి పెంచడం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారత్‌కు ఇది ఆర్థికంగా ఒక యుద్ధ పోరు లాంటిది. ఇంతకీ ఈ నిర్ణయం వల్ల భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో, భారత్ ఎలా ఎదుర్కొనబోతోందో తెలుసుకుందాం.
-టారిఫ్ పెంపు వెనక ట్రంప్ ఉద్దేశ్యం ఏమిటి?
ఈ పెంపు వెనక ప్రధాన కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న భారత్ వైఖరినే ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా విధించిన ఆంక్షలకు తలొగ్గకుండా భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగించడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. దాంతోనే భారత్‌పై వాణిజ్య పద్ధతుల్లోనే ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
-టారిఫ్‌ల ప్రభావం ఎక్కడ ఎక్కువగా పడుతుంది?
ఇండియా-అమెరికా వాణిజ్య సంబంధాల్లో అమెరికా భారత ఎగుమతుల ప్రధాన మార్కెట్ గా ఉంది. ముఖ్యంగా డైమండ్, జ్యువెలరీ, టెక్స్‌టైల్, అప్పారెల్, కెమికల్స్ రంగాలు ఎక్కువగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడే రంగాలు. యూబీఎస్ నివేదిక ప్రకారం ట్రంప్ టారిఫ్‌ల కారణంగా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తేలికపాటి తయారీ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
-స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
స్టాక్ మార్కెట్‌పై తక్కువ స్థాయిలో ప్రభావం ఉంటుందనొచ్చు. నిఫ్టీ 50 కంపెనీల్లో అమెరికాతో డైరెక్ట్ ఎక్స్‌పోజర్ సుమారుగా 9% మాత్రమే ఉంది. అవి కూడా ప్రధానంగా ఐటీ సేవల కంపెనీలు. ఐటీ రంగంపై తాజా టారిఫ్‌లు ప్రభావం చూపే అవకాశం లేదు. అదే విధంగా ఫార్మా, సెమీకండక్టర్స్, మౌలిక వనరుల రంగాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.
-వ్యవసాయ, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం
ఆక్వా కల్చర్, వర్క్ వేర్, లెదర్ గూడ్స్, MSME రంగాలు ఈ సుంకాల బలికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ రంగాల్లో భారత్ ఇప్పటికే అమెరికాలో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇప్పుడు సుంకాలు పెరగడంతో భారత్‌కు ఉన్న ధరల ఆధిక్యం పోయే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్డర్లు తగ్గిపోవడం, ఉద్యోగాల్లో కోతలు రావడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
-భారత్ కౌంటర్ స్ట్రాటజీ ఏమిటి?
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆనంద్ మహీంద్రా సూచించినట్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మళ్లీ దృష్టి పెట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేందుకు విధానాలలో పారదర్శకత అవసరం. సింగిల్ విండో క్లియరెన్స్ విధానం అమలు చేయాలి. పారిశ్రామిక, విదేశీ పెట్టుబడులకు అనువైన వాతావరణం అందించాలి. పర్యాటక రంగానికి బూస్ట్ కల్పించాలి. ఫారెక్స్ సంపాదన కోసం టూరిజాన్ని ప్రోత్సహించాలి. వీసా విధానాలను సులభతరం చేయాలి. MSMEలకూ నిధుల ప్రాధాన్యతనివ్వాలి. నిత్యం కష్టాల్లో ఉంటున్న చిన్న పరిశ్రమలకు తక్షణ సహాయ ప్యాకేజీలు ఇవ్వాలి. దిగుమతి సుంకాల్లో పునఃసమీక్షన చేసి తయారీ రంగానికి ప్రోత్సాహంగా దిగుమతి సుంకాలను సర్దుబాటు చేయాలి.
-ప్రభావాన్ని తగ్గించే మార్గాలు
భారత్ తాత్కాలికంగా అమెరికా ఆధారిత మార్కెట్ల నుంచి దూరంగా ఉండాల్సి రావచ్చు. దక్షిణ ఆసియా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను అభివృద్ధి చేయడం అత్యవసరం. అదే విధంగా ఎగుమతి రంగానికి టెక్నాలజీ ఆధారిత పునర్నిర్మాణం చేయడం ద్వారా పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు భారత జ్యువెలరీ, వస్త్రాలు, కెమికల్స్ రంగాలకు షాక్‌గా మారినా, ఇది భారత ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ముంచేయదు. ప్రస్తుత దెబ్బ తాత్కాలికమే. వ్యూహాత్మకంగా ముందుకెళ్తే భారత్ ఈ సమస్యను అధిగమించడమే కాదు, వాణిజ్య విధానాల్లో దూకుడు ప్రదర్శించగలదు. ప్రభుత్వ పరిశ్రమ, పరిశ్రమల వినూత్న ఆలోచనలతో కలిసి ఈ ప్రతిస్పందన భారత్‌కు ఓ మేలుచేసే మార్గంగా మారవచ్చు.