అద్దె ఇంట్లో పాక్ నటి డెడ్ బాడీ.. పట్టించుకోని ఫ్యామిలీ!
చనిపోయి రెండు వారాలైనా, శవం కుళ్లి అద్దె ఫ్లాట్ లో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథేడే లేదు.;
ఇది ఒక కళాకారిణి అత్యంత విషాదకరమైన మరణం. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే దుర్మరణం. చనిపోయి రెండు వారాలైనా, శవం కుళ్లి అద్దె ఫ్లాట్ లో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథేడే లేదు. ప్రపంచంలో ఏ మూల అయినా కళారంగంలో కొన్ని ఇలాంటి ఘటనలు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ దుర్ఘటన ఒక పాకిస్తానీ నటికి సంబంధించినది. పాకిస్తాన్ నటి కం మోడల్ హుమైరా అస్గర్ అలీ 8 జూలై మంగళవారం కరాచీలోని ఉన్నత స్థాయి డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (డిహెచ్ఏ) ఫేజ్ 4లోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించారు. 32 ఏళ్ల మహిళ తీవ్రంగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించిందని, దాదాపు రెండు వారాల క్రితం మరణించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దుర్మరణానికి మించిన షాకింగ్ విషయం మరొకటి ఉంది. చనిపోయిన నటి కుటుంబీకులు ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు నిరాకరించారు. ఆమెతో తెగతెంపులు చేసుకున్నాం.. మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ అమానవీయ ఘటన కలచివేసింది.
హుమైరా అస్గర్ అలీ ఏఆర్.వై డిజిటల్ రియాలిటీ షో `తమాషా ఘర్`తో పాపులరయ్యారు. `బిగ్ బ్రదర్` తరహా షో ఇది. 2015 యాక్షన్ థ్రిల్లర్ జలైబీ, జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి టీవీ సీరియళ్లలోను అస్గర్ అలీ నటించింది. చివరిగా 2021లో ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్‌లతో కలిసి `లవ్ వ్యాక్సిన్` అనే చిత్రంలో నటించింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ నటి అంతిమ సంస్కారాలకు కుటుంబం సహకరించకపోయినా, ఆమె సహ నటి సోనియా హుస్సేన్ అంత్యక్రియలు జరిపించేందుకు ముందుకు వచ్చారు.