దేశం కోసం కాళ్లు పోగొట్టుకున్న సైనికుడి పట్ల టోల్ సిబ్బంది అమానుషం
గడిచిన పది రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినోళ్లు చాలామంది అది ఫేక్ అనుకున్నారు.;
గడిచిన పది రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినోళ్లు చాలామంది అది ఫేక్ అనుకున్నారు. కారణం.. టోల్ సిబ్బంది ఒక న్యాయవాది మీద అంత దుర్మార్గంగా దాడి చేయటమా? అదేమీ నిజం కాదని భావించారు. కానీ.. వాస్తవాల్ని చెక్ చేసినప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా పరిధిలోని గోటోనా బారా టోల్ ప్లాజా వద్దకు అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతాప్ గఢ్ కు చెందిన న్యాయవాది రత్నేష్ శుక్లా తన కారులో టోల్ ప్లాజా వద్దకు వెళ్లారు.
టోల్ కు సంబంధించిన ఉదంతంలో ఆయన్ను అక్కడి సిబ్బంది విచక్షణారహితంగా కొట్టటమేకాదు.. క్షమాపణలు చెప్పాలంటూ బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారటమే కాదు.. కొద్ది గంటల వ్యవధిలోనే భారీ ఎత్తున లాయర్లు తమ వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు. దాడికి పాల్పడిన సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేయటమే కాదు.. దాడికి గురైన లాయర్ కు సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ ఉదంతంపై హైదర్ ఘర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. టోల్ ప్లాజా మేనేజర్ తో సహా ఐదుగురిని అరెస్టు చేవారు. అంతేకాదు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి.. సదరు టోల్ ప్లాజా కాంట్రాక్టు ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. వారం పాటు ఆ టోల్ ప్లాజా నుంచి వాహనాల్ని ఉచితంగా అనుమతించారు. టోల్ ప్లాజా సిబ్బంది అరాచకాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది ఈ ఉదంతం. కట్ చేస్తే.. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న వైనం మనసును కదిలించేలా చేస్తోంది.
ఆపరేషన్ పరాక్రమ్ లో తన రెండు కాళ్లు పోగొట్టుకున్న మాజీ సైనికాధికారి పట్ల టోల్ సిబ్బంది అమానుషంగా వ్యవహరించిన ఉదంతం తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. బాధితుడైన మాజీ సైనికాధికారి 42 ఏళ్ల శ్యామరాజ్ సొంతంగా తనకు ఎదురైన పరిస్థితిని రికార్డు చేసి పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇంతకూ జరిగిందేమంటే.. కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతం కాసరగోడ్ లో ఉంటున్న మాజీ ఆర్మీ కమాండర్ శ్యామరాజ్ తాజాగా ఉడిపి జిల్లా కుందాపురలోని సస్థాన టోల్ ప్లాజా మీదుగా వెళుతున్నారు.
నిబంధనల ప్రకారం సైనికులు.. మాజీ సైనికులు దేశంలోని ఏ టోల్ ప్లాజా నుంచైనా స్వేచ్ఛగా వెళ్లే వీలుందని చెప్పినా అక్కడి సిబ్బంది ససేమిరా అన్నారు. తన గుర్తింపు కార్డును చూపించినా వారు వదల్లేదు. నిబంధనలు తెలిసినా.. తెలియనట్లుగా ప్రవర్తిస్తూ టోల్ ఛార్జీలు చెల్లించాల్సిందేనని పట్టు పట్టారు. సైనికులకు ఉండే మినహాయింపుల గురించి టోల్ సిబ్బంది తెలియనట్లుగా వ్యవహరించిన తీరుపై శ్యామ రాజ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
తమలాంటి సైనికులకు ఈ దేశంలో లభించే గౌరవం ఇదేనా? అన్న ఆయన ప్రశ్న పలువురిని కదిలిస్తోంది. ఈ ఉదంతం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. వీడియో వైరల్ అయిన వేళ.. టోల్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏమైనా.. టోల్ సిబ్బంది అరాచకాలకు కళ్లం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.